ఓపెన్‌ ఏఐ మైక్రోసాఫ్ట్‌ను తినేస్తుంది : ఎలాన్‌ మస్క్‌

Telugu Lo Computer
0


పెన్‌ ఏఐ సంస్థ తాజాగా తన పవర్‌ఫుల్‌ ఏఐ మోడల్‌ 'చాట్‌జీపీటీ-5'ని పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో టెస్లా, ఎక్స్‌ఏఐ సంస్థల సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఓపెన్‌ ఏఐ మైక్రోసాఫ్ట్‌ను ఏదో రోజు తినేస్తుంది' అంటూ ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు. దీనిపై సత్య నాదెళ్ల కూడా అదేస్థాయిలో స్పందించారు. జీపీటీ-5 విడుదల, పనితీరు, సామర్థ్యం గురించి మైక్రోసాఫ్ట్‌ సత్య నాదెళ్ల తాజాగా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ఈ రోజు నుంచి జీపీటీ-5, మైక్రోసాఫ్ట్‌ 365 కోపైలట్‌, గిట్‌హబ్‌ కోపైలట్‌, కోపైలట్‌, Azure AI Foundry వంటి అన్ని ప్లాట్‌ఫాంల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇది మా భాగస్వామి ఓపెన్‌ఏఐ నుంచి వచ్చిన అత్యంత శక్తిమంతమైన మోడల్ అని ఆయన పేర్కొన్నారు. ఇది విశ్లేషణ, కోడింగ్‌, చాట్ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తుందని తెలిపారు. ఇది మైక్రోసాఫ్ట్‌ Azureలో శిక్షణ పొందిన మోడల్ అన్నారు. జీపీటీ-5ని ఉద్దేశిస్తూ ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. 'ఏదో ఓ రోజు ఓపెన్‌ఏఐ మైక్రోసాఫ్ట్‌నే తినేస్తుంది' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓపెన్‌ఏఐపై ఎప్పటిలానే తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై సత్య నాదెళ్ల కూడా ఎక్స్‌ వేదికగా స్పందించారు. 'దీని కోసం గత 50 ఏళ్లుగా చాలామంది ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ కొత్తగా నేర్చుకోవడం, భాగస్వాములు కావడం, పోటీపడడం కొనసాగుతోంది'' అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ''ఓపెన్‌ఏఐ అడ్వాన్స్‌డ్‌ ఏఐ మోడల్‌ ఆవిష్కరిస్తే ఆ తర్వాత జెమిని, గ్రోక్‌ వాటిని అందిపుచ్చుకుంటూ ఉంటాయి'' అనే అర్థం వచ్చేలా ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేయగా 'గ్రోక్‌ 4 ఇప్పటికే పవర్‌ఫుల్‌ ఏఐ మోడల్‌' అంటూ ఎలాన్‌ మస్క్‌ బదులిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)