టీవీని కంప్యూటర్‌గా మార్చుకునే జియో పీసీ, జియో ఫ్రేమ్స్ పేరిట స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకొస్తున్నట్లు 48వ రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశంలో ఆకాశ్ అంబానీ వెల్లడించారు. దీంతో పాటు జియో హాట్‌స్టార్‌కు ఏఐ సొబగులు అద్దుతూ మరికొన్ని కొత్త ఫీచర్లను జోడిస్తున్నట్లు తెలిపారు. రిలయన్స్, వాల్ట్ డిస్నీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ రెండో అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించిందని ఆకాశ్ అంబానీ తెలిపారు. ఇతర దేశాలకూ విస్తరిస్తామని చెప్పారు. అలాగే, జియోస్టార్‌లో రియా పేరుతో కొత్త ఏఐ అసిస్టెంట్‌ను జోడిస్తున్నట్లు తెలిపారు. ఇది కంటెంట్‌ను వెతకడానికి దోహదపడుతుందని చెప్పారు. మీకు కావాల్సిన ఎపిసోడ్స్‌ను స్క్రోల్ చేయకుండా వాయిస్ కమాండ్స్‌తో సెర్చ్ చేయొచ్చని తెలిపారు. దీంతో పాటు 'వాయిస్ ప్రింట్' అనే మరో ఏఐ టూల్‌ను కూడా జోడిస్తున్నట్లు తెలిపారు. వాయిస్ క్లోనింగ్, లిప్‌సింక్ టెక్నాలజీ ద్వారా నచ్చిన భారతీయ భాషలో నటులు, ప్లేయర్లు మాటలు వినొచ్చని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. దీంతో పాటు మ్యాక్స్‌వ్యూ 3.0ను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. టీవీని సులువుగా పర్సనల్ కంప్యూటర్‌గా మార్చుకోవచ్చని జియో ప్రతినిధి తెలిపారు. కేవలం కీబోర్డును జియో సెటాప్‌నకు కనెక్ట్ చేసుకుని టీవీని వర్చువల్ కంప్యూటర్‌గా మార్చుకోవచ్చు. ఎంతవాడితే అంతకే చెల్లించాలని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. అవసరాలకు అనుగుణంగా ఎక్కడి నుంచైనా ఈ క్లౌడ్ పీసీని యాక్సెస్ చేయొచ్చని తెలిపారు. ఈ పీసీ ఎప్పుడూ అప్-టు-డేట్‌గా ఉంటుందని తెలిపారు. కావాలంటే మెమొరీ, స్టోరేజీ, కంప్యూటింగ్ పవర్‌ను అవసరాలకు అనుగుణంగా పెంచుకోవచ్చన్నారు. జియో ఫ్రేమ్స్ పేరిట స్మార్ట్ కళ్లజోడును ఆకాశ్ అంబానీ ప్రకటించారు. దీని సాయంతో కాల్స్ చేసుకోవచ్చు. ఫొటోలు తీసుకోవచ్చు. ఎలాంటి ఇయర్‌ఫోన్స్ లేకుండానే మ్యూజిక్‌ను ఆనందించొచ్చు. ఇందులో బిల్ట్ ఇన్‌గా జియో వాయిస్ ఏఐ ఉంటుంది. ఈ స్మార్ట్‌గ్లాస్ అన్ని భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. అయితే, జియో ఫ్రేమ్స్ ధర, ఇతర వివరాలు వెల్లడించలేదు. రేబన్ ఇప్పటికే ఈ తరహా స్మార్ట్‌గ్లాసెస్‌ను దేశీయ మార్కెట్‌లోకి రూ.29,900కు లాంచ్ చేసింది. దీని ధర ఎంత నిర్ణయిస్తారో చూడాలి. జియో వెబ్‌సైట్‌లో ఇంట్రెస్ట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు.
హాట్‌స్టార్‌లో వాయిస్ ప్రింట్, జియో పీసీ, జియో ఫ్రేమ్స్ తీసుకొస్తున్నట్లు రిలయన్స్ ప్రకటన
August 29, 2025
0
Tags