దేశవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న13.04 కోట్ల జన్ ధన్ ఖాతాలు

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా తెరిచిన మొత్తం జన్ ధన్ ఖాతాలలో దాదాపు నాలుగో వంతు ఖాతాలు నిరుపయోగంగా మారాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పంకజ్ చౌదరి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది జూలై 31 నాటికి దేశంలో మొత్తం 56.03 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉండగా, వాటిలో 13.04 కోట్ల ఖాతాలు నిరుపయోగంగా ఉన్నాయి. నిరుపయోగ ఖాతాలు అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో 2.75 కోట్లు ఉండగా, ఆ తర్వాత బీహార్‌లో 1.39 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 1.07 కోట్ల ఖాతాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, ఒక ఖాతాలో రెండేళ్లకు పైగా ఎలాంటి లావాదేవీలు జరగకపోతే దానిని నిరుపయోగ ఖాతాగా పరిగణిస్తారు. ఈ ఖాతాలను తిరిగి క్రియాశీలకంగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. నిరుపయోగంగా ఉన్న ఖాతాలకు కూడా ప్రత్యక్ష నగదు బదిలీ నిధులను జమ చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఖాతాదారులకు ప్రతి మూడు నెలలకోసారి లేఖలు, ఈమెయిల్స్ లేదా ఎస్ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించి, ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని సూచిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా జూలై 1న ప్రారంభమైన "గ్రామ పంచాయతీ స్థాయి శాచురేషన్ క్యాంపెయిన్" సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందని, రీ-కేవైసీ ద్వారా ఖాతాలను పునరుద్ధరించడంపై దృష్టి సారించామని ఆయన తెలిపారు.ఇదే సందర్భంగా, యూపీఐ లావాదేవీలపై ప్రస్తుతం ఎలాంటి ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. అలాగే, క్రిప్టోకరెన్సీలు, క్రిప్టో ఆస్తులు తమ నియంత్రణ పరిధిలోకి రావని ఆర్బీఐ తెలిపిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, గోల్డ్ లోన్లకు సంబంధించిన నిరర్థక ఆస్తులు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు ఎన్‌బీఎఫ్‌సీలలో కూడా స్వల్పంగా పెరిగాయని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)