ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని మరో రెండు నెలలు పాటు పొడిగింపు

Telugu Lo Computer
0

ఫ్రీ హెల్డ్ భూముల విషయంలో ఏడాది కాలంగా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తుండగా తాజా నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. వీటి రిజిస్ట్రేషన్లకు అనుమతి కోసం అనేక మంది నిరీక్షి స్తున్నారు. కాగా, ఇప్పుడు ప్రభుత్వం వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని మరో రెండు నెలలు పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై రైతులు, ఇతరులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారం ఆగస్టు, సెప్టెంబరు నాటికి ఈ సమస్యను కొలిక్కి తెస్తామని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. దసరా నుంచి ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఫ్రీహోల్డ్‌పై ఎటూ తేల్చకుండా కాలం గడిపేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఫ్రీ హోల్డ్ భూముల వివాదం పరిష్కరించాలని ఆదేశించారు. ఈ భూములకు అర్హులు ఎవరైనా ఏ పార్టీ వారు ఉన్నా అర్హులను న్యాయం చేయాలని సూచించారు. అసైనీలు భూమిపై పొజిషన్‌లో ఉన్నవి, పక్కా అసైన్‌మెంట్‌ రికార్డులు కలిగి ఉండి 20 ఏళ్లు గడువు దాటిన వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రీహోల్డ్‌ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అసైన్‌మెంట్‌ రికార్డులు లేని భూములు, కలెక్టర్‌ ఉత్తర్వులు లేనివి, జీవో 596కి విరుద్ధంగా ఉన్నవి, అధిక విస్తీర్ణం క్లెయిమ్‌ చేసేవి, అసలైన అసైనీలు భూమిపై పొజిషన్‌లో లేనివి, ఇతరులు క్లెయిమ్‌ చేసే భూములు, అభ్యంతరాలున్న పోరంబోకు భూములు, 20 ఏళ్ల గడువు దాటని అసైన్డ్‌ భూములకు ఫ్రీహోల్డ్‌ వద్దని స్పష్టంగా ఆదేశించారు. కాగా, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో మరో రెండు నెలలు నిషేధం కొనసాగనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)