కృత్రిమమేధ ముప్పును తక్కువ అంచనా వేస్తున్నాయి : జెఫ్రీ హింటన్‌ ఆందోళన

Telugu Lo Computer
0


ఐతో తలెత్తే ప్రమాదాలను టెక్నాలజీ కంపెనీలు పట్టించుకోవడం లేదని, కృత్రిమమేధ ముప్పును తక్కువ అంచనా వేస్తున్నాయని ఏఐ పితామహుడు జెఫ్రీ హింటన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ''కీలక శాస్త్రవేత్తలు ఏఐ ముప్పును తక్కువ చేసి చెప్తున్నారని నా అభిప్రాయం. డెమిస్‌ హస్సాబిస్‌ (డీప్‌మైండ్‌ సంస్థ సీఈఓ) వంటివారు ఈ ముప్పును  అర్థం చేసుకొని, దానిని ఎదుర్కొనేందుకు పనిచేయాలనుకుంటున్నారు. తొలినాళ్లలో ఈ ప్రమాదాన్ని గుర్తించనందుకు చింతిస్తున్నాను'' అని అన్నారు. దశాబ్దం పాటు సేవలు అందించి 2023లో హింటన్‌ గూగుల్‌ను వీడారు. ఏఐని విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడానికి గూగుల్ చేస్తోన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆయన వెళ్లిపోయారని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో వాస్తవం లేదని తాజాగా ఆయన వెల్లడించారు. అప్పటికి తన వయసు 75 ఏళ్లని, ఆశించినమేర పనిచేయలేకపోవడం వల్లే ఆ సంస్థను వీడినట్లు చెప్పారు. అయితే ఇప్పుడు తాను ఏఐ ముప్పు గురించి స్వేచ్ఛగా మాట్లాడగలనని వ్యాఖ్యానించారు. ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్‌వర్క్స్‌లో చేసిన కృషికిగానూ హింటన్‌కు 2024లో ఫిజిక్స్ విభాగంలో నోబెల్ వరించింది. ఆ రంగంలో దశాబ్దకాలం పాటు ఆయన చేసిన కృషి ఫలితమే ఇప్పుడు ఏఐ విప్లవానికి దోహదం చేసింది. కృత్రిమ మేధ ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. దానిపై గూగుల్‌ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్‌ హస్సాబిస్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోవడం కంటే దాని దుర్వినియోగమే అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఒకవేళ అలా జరిగితే వినాశకర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అలాంటి వ్యక్తులకు వీటి యాక్సెస్‌ను పరిమితం చేయాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)