హైదరాబాద్ లోని చైతన్యపురిలో మూసీ నది పరివాహక ప్రాంతంలో పెద్ద మొసలి ప్రత్యక్షమైంది. మొసలి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. చైతన్యపురిలో ఫణిగిరి కాలనీలోని శివాలయం వద్ద మొసలి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నాలుగు రోజుల క్రితం నది మధ్యలో గడ్డి కోస్తున్న వ్యక్తికి మొసలి కనిపించింది. మొసలిని చూసి అతడు భయపడి వెంటనే ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేశాడు. రెండు రోజులుగా స్థానిక యువకులు నది ఒడ్డుకు వస్తున్నారు. మొసలి వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మొసలి కదలికలపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. శివాలయం వైపు ఎవరూ వెళ్లొద్దని అక్కడ మొసలి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందిస్తూ నది మధ్యలో ఉన్న మొసలిని ఏమీ చేయలేమని వారు చెప్పారు. అటవీ శాఖ అధికారులు మొసలిని బంధించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మూసీ నది పరివాహక ప్రాంతంలో మొసలి ప్రత్యక్ష్యం !
July 31, 2025
0
Tags