కృత్రిమ మేధ రంగంలో భారత్‌కు ఉన్న అవకాశాలు, సవాళ్లు : ఏవీపీఎన్‌ నివేదిక

Telugu Lo Computer
0


గూగుల్, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ)ల సహకారంతో ఏవీపీఎన్‌ అనే సంస్థ 'ఏఐ ఫర్ ఆల్: బిల్డింగ్ ఆన్ ఏఐ-రెడీ వర్క్‌ఫోర్స్ ఇన్ ఆసియా-పసిఫిక్' పేరిట ఓ నివేదికను రూపొందించింది. కృత్రిమ మేధ రంగంలో భారత్‌కు ఉన్న అవకాశాలు, సవాళ్లను ఇందులో పొందుపర్చింది. నివేదిక ప్రకారం 2030 నాటికి 'ఆసియా-పసిఫిక్' ప్రాంత జీడీపీకి కృత్రిమ మేధ 3 ట్రిలియన్ డాలర్ల వరకు ఆదాయం ఆర్జించగలదు. యువశక్తి, వేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభా కలిగిన భారత్‌ ఇందులో కీలక పాత్ర పోషించగలదు. ఏఐ ఆధారిత ఆటోమేషన్‌లో పురోగతిని లెక్కలోకి తీసుకుంటే డేటా ఎంట్రీ, షెడ్యూలింగ్‌, కస్టమర్‌ సర్వీస్‌ వంటి అడ్మినిస్ట్రేటివ్‌, సపోర్ట్‌ రంగాల్లోని ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉంది. ఈ తరహా ఉద్యోగాల్లో మహిళలు, అసంఘటిత కార్మికులు, డిజిటల్ అక్షరాస్యతలో వెనుకబడినవారే ఎక్కువగా ఉన్నారు. తయారీ, టెక్స్‌టైల్స్‌, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెద్దమొత్తంలో అసంఘటిత కార్మికులు ఉన్నారు. ఈ రంగాలను ఏఐ, ఆటోమేషన్‌లు తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఏఐ స్కిల్స్‌ను అందిపుచ్చుకోని క్రమంలో వీరు ఉద్యోగ మార్కెట్‌లో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. దేశ యువతలో చాలామంది ప్రస్తుతం తమ మొదటి ఉద్యోగ వేటలో ఉన్నారు లేదా మెరుగైన అవకాశాల కోసం నైపుణ్యాలను పెంచుకోవాలని ఆశిస్తున్నారు. నివేదిక ప్రకారం యువత పొందుతున్న నైపుణ్య శిక్షణకు, సంస్థలు ఆశిస్తున్న వాటిమధ్య సంబంధం లేనట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల విషయంలో కొన్నేళ్ల క్రితం ఉన్నవాటితో పోలిస్తే చాలా భిన్నమైన ప్రొఫైల్‌లను నేడు సంస్థలు కోరుకుంటున్నాయి. కేవలం డిగ్రీలే కాకుండా.. క్రిటికల్‌ థింకింగ్‌, అవసరానికి తగినట్లు తమనుతాము మార్చుకోవడం, ఏఐ టూల్స్‌ను సమర్థంగా ఉపయోగించడం వంటి నైపుణ్యాల కోసం చూస్తున్నాయి. భారత్‌లో 'ఏఐ'ను అందిపుచ్చుకునే విషయంలో డిజిటల్ యాక్సెస్‌ కూడా ప్రధాన అడ్డంకి. అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఉజ్వల ఏఐ భవిష్యత్తు కోసం ఈ డిజిటల్‌ అంతరాలను తగ్గించాలని నివేదిక సిఫార్సు చేసింది. దేశ శ్రామిక శక్తిలో దాదాపు 35 శాతం మహిళలే. ఆటోమేషన్ ముప్పు పొంచి ఉన్న ఆఫీస్ సపోర్ట్, రిటైల్ సేవల వంటి రంగాల్లో వీరి ప్రాతినిధ్యమే అధికం. కుటుంబ బాధ్యతల కారణంగా చాలా మంది మహిళలు ఉద్యోగాల నుంచి వైదొగులుతున్నారు. తిరిగి వచ్చే క్రమంలో వేగంగా మారుతున్న ఉద్యోగ మార్కెట్‌ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం అనువైన, సందర్భోచిత ఏఐ నైపుణ్య కార్యక్రమాలను రూపొందించాలని సూచించింది. 2024లో దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఇబ్బంది పడ్డారని ఓ వార్తాసంస్థ కథనాన్ని ఈ నివేదిక ఉటంకించింది. దీని ప్రకారం.. 15 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 10 శాతం మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ డిమాండ్లకు అనుగుణంగా శిక్షణను అందించాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. ఏఐ నైపుణ్యాలు కలిగిన శ్రామిక శక్తి పెంపు కోసం దోహదపడే అనేక చర్యలను నివేదిక సిఫార్సు చేసింది. ఫ్రెషర్లు, అసంఘటిత కార్మికులు, మహిళలు, డిజిటల్‌ అక్షరాస్యతలో వెనుకబడినవారు. ఇలా ఉద్యోగార్థుల వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలి. సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది నిజ జీవితంలో ఉపయోగపడే, పరిస్థితులకు తగిన శిక్షణను కోరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాక్టికల్‌ నైపుణ్యాలపై దృష్టి సారించాలి. సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 15 శాతం మంది మాత్రమే ఏఐ నైపుణ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత్‌లో ఈ సంఖ్య మరింత తక్కువ! ఈ నేపథ్యంలో ఏఐ శిక్షణపై మరింత అవగాహన, భాగస్వామ్యం అవసరం. భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు 90 శాతానికి పైగా ఉన్నాయి. వీటిలోని చాలా వరకు ఉద్యోగులకు ఏఐ టూల్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు వనరులు లేవు. దీని కోసం ప్రభుత్వం, ప్రైవేటు రంగాల నుంచి మద్దతు అవసరం. మహిళలు, డిజిటల్‌ అక్షరాస్యతలో వెనుకబడినవారిని పరిగణనలోకి తీసుకోకపోతే ఏఐ విషయంలో ఇప్పటికే ఉన్న అసమానతలను మరింత తీవ్రతరమవుతాయి. ఈ విషయంలో అప్రమత్తత అవసరం

Post a Comment

0Comments

Post a Comment (0)