షికోపుర్ ల్యాండ్స్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన్ను గతంలో పలుమార్లు దర్యాప్తు సంస్థ విచారణకు పిలిపించి ప్రశ్నించింది. వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గురుగ్రామ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్‌కు రూ.58 కోట్లకు విక్రయించింది. ఈ డీల్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతోంది. ఈ కేసుకు సంబంధించి 2018 సెప్టెంబర్‌లో వాద్రా పేరు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. ఆయనతోపాటు నాటి హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్, ఓ ప్రాపర్టీ డీలర్ పేరును దీనిలో ప్రస్తావించారు. దీనిలో అవినీతి, ఫోర్జరీ చీటింగ్ తదితర నేరాలు నమోదయ్యాయి.మరోవైపు వాద్రా కుటుంబం మాత్రం మొదటి నుంచి ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని కొట్టిపారేస్తూ వచ్చింది. కేసును ధైర్యంగా ఎదుర్కొంటానని ఒక సందర్భంలో రాబర్ట్ వాద్రా స్వయంగా వెల్లడించారు. తాను గాంధీ కుటుంబంలో భాగం కావడం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. అదే తాను భాజపాలో చేరి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నాడు పేర్కొన్నారు.
షికోపుర్ ల్యాండ్స్ వ్యవహారానికి సంబంధించి రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు
July 17, 2025
0
Tags