అమెరికా పౌరసత్వం కలిగిన తమ బంధువుల చిన్నారిని దత్తత తీసుకుంటామని ప్రయత్నించిన భారతీయ దంపతులకు చుక్కెదురు అయ్యింది. ఆ చిన్నారిని దత్తత తీసుకునే ప్రాథమిక హక్కు భారతీయులకు లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు ఇక్కడి చట్టాలు అంగీకరించవని, యూఎస్ చట్టాల ప్రకారం దత్తత తీసుకొని, ఆ తర్వాతే ఇక్కడి దత్తత విధానాన్ని పాటించాలని సూచించింది. ''విదేశీ పౌరసత్వం ఉన్న చిన్నారిని బంధువులు దత్తత తీసుకునే అంశానికి సంబంధించి జువెనైల్ జస్టిస్ యాక్టు లేదా సంబంధిత దత్తత నిబంధనల్లో ఎటువంటి నిబంధన లేదు'' అని జస్టిస్ రేవతి మోహితే డెరే, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనం పేర్కొంది. అమెరికా చట్టాల ప్రకారం దత్తత తీసుకుని, ఆ తర్వాత భారత్‌కు తీసుకువచ్చేందుకు దత్తత అనంతరం విధానాన్ని పాటించాలని సూచించింది. ఈ దత్తత కోసం తన అసాధారణ అధికారాలను ఉపయోగించడానికీ నిరాకరించిన ధర్మాసనం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. భారత్‌కు చెందిన దంపతులకు అమెరికాలో బంధువులున్నారు. వీరికి 2019లో ఓ బాలుడు జన్మించాడు. నెలల వయసున్నప్పుడే ఆ దంపతులు అతడిని ఇక్కడకు తీసుకువచ్చారు. అప్పటి నుంచి బాలుడు వారితోనే ఉంటుండగా, అతన్ని దత్తత తీసుకోవాలని భావించారు. కానీ ఇందుకు చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలుత వీరు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీలో రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించినప్పటికీ ఈ దత్తతకు ఇక్కడ చట్టాలు అంగీకరించవని పేర్కొంది. దీంతో బాంబే హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా వారికి నిరాశ ఎదురయింది.
అమెరికా పౌరసత్వం కలిగిన చిన్నారిని దత్తత తీసుకునే హక్కు భారతీయులకు లేదు !
July 17, 2025
0
Tags