రూ.1197 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన స్విగ్గీ !

Telugu Lo Computer
0


స్విగ్గీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.1197 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ రూ.611 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంటే ఏడాదిలో నష్టాలు దాదాపు రెట్టింపయ్యాయి. సమీక్షా త్రైమాసికంలో స్విగ్గీ మొత్తం ఆదాయం కూడా రూ.3,310 కోట్ల నుంచి రూ.5,048 కోట్లకు పెరిగింది. డెలివరీ ఖర్చులు, అడ్వైర్టైజ్‌మెంట్‌ ఖర్చులు, ఎంప్లాయీ బెనిఫిట్స్‌, క్విక్‌కామర్స్‌కు సంబంధించి లాజిస్టిక్స్‌ ఖర్చులు వంటి మొత్తం ఖర్చులు కూడా రూ.3908 కోట్ల నుంచి రూ.6244 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో స్విగ్గీ షేరు 0.62 శాతం లాభంతో రూ.403 వద్ద ముగిసింది. విభాగాల వారీగా చూస్తే ఫుడ్‌డెలివరీ సెగ్మెంట్‌ ఆదాయం రూ.1799 కోట్లు కాగా, రూ.202 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్విక్‌కామర్స్‌ విభాగమైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ ఆదాయం రూ.806 కోట్లు కాగా.. రూ.797 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. సప్లయ్‌ చైన్‌, డిస్ట్రిబ్యూషన్‌ ఆదాయం రూ.2,259 కోట్లు కాగా.. ఈ విభాగంలో రూ.47 కోట్ల నష్టం వచ్చినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దీర్ఘకాలిక సుస్థిర లాభాల దృష్ట్యా ఇతర విభాగాలపై పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం భారీ నష్టాలకు కారణమని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మాజేటి తెలిపారు. దాదాపు ఇదే బిజినెస్‌ మోడల్‌తో నడుస్తున్న జొమాటో మాతృ సంస్థ ఎటెర్నల్‌.. ఇదే త్రైమాసికంలో రూ.25 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. 

Post a Comment

0Comments

Post a Comment (0)