అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా విజయవంతంగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పేరు దేశమంతటా మారుమ్రోగిపోతుంది. అక్కడ ఆ బృందం 14 రోజుల పాటు చేయనున్న పరిశోధనల గురించే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. యావత్తు దేశం గర్వపడేలా చేసిన కుమారుడిని కన్న తల్లిదండ్రుల భావోద్వేగం మాటలకందనిది. అంతరిక్షంలోకి అడుగుపెట్టి తమ కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులిద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లక్నోలోని తమ ఇంటి నుంచి తమ కుమారుడు శుభాంశు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆక్సియమ్ మిషన్ 4 ఆకాశంలోకి ఎగిసిన విధానాన్ని వీక్షించారు. ముఖ్యంగా శుభాంశు తల్లి ఆశా శుక్లాకి అదంతా చూసి కన్నీళ్లు ఆగలేదు. అయితే అవి ఆనందంతో ఉప్పొంగిన ఆనందభాష్పాలని చెప్పారామె. తమ బంధువులు, సన్నిహితులు స్క్రీన్‌లకి అతుక్కుపోయి చూస్తున్న విధానం తనకు పట్టరాని ఆనందాన్నిచ్చిందని అన్నారామె. మాటలే రానంతగా గొతు వణుకుతోందామెకు. అలాగే అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి చేరిన వెంటనే గ్రూప్ కెప్టెన్ శుభాంశు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ''అంతరిక్షం నుంచి మీ అందరికి నమస్కారం. ఈ యాత్ర చాలా అద్భుతంగా ఉంది. సుమారు 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షంలోకి తిరిగి వచ్చాం. ఈ అద్భుత యాత్రలో ప్రతి భారతీయుడూ నాకు తోడుగా ఐఎస్‌ఎస్‌లో ఉన్న భావనే కలుగుతోంది మీ అందరి ప్రేమ, ఆశీస్సులతోనే ఐఎస్‌ఎస్ చేరగలిగా. మనమంతా కలిసి ఈ యాత్రను మరింత ఉత్సాహభరితంగా మారుద్దాం. మీ అందరితో పాటు త్రివర్ణ పతాకం వెంట రాగా నాతోపాటు ఐఎస్‌ఎస్ చేరా. ఇది నా ఒక్కని ఘనత కాదు. భారతీయులందరి విజయం." అని అన్నారు. దానికి అతడి తల్లిదండ్రులు స్పందిస్తూ అది కేవలం తమ కుమారుడి దేశభక్తి మాత్రమే కాదు. అది చాలా వ్యక్తిగతమైనది. మా బిడ్డ ఇప్పుడు దేశ జెండా తోపాటు ఆ నక్షత్రాల మధ్య యావత్తు దేశ సామూహిక ఆకాంక్షలను తన భుజాలపై మోస్తున్నాడు. అని భావోద్వేగంగా అన్నారు. కాగా తమ కుమారుడితో అంతరిక్షంలోనికి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఫోన్‌లో సంభాషించినట్లు తెలిపారు. నాన్న నా గురించి బాధపడుతూ ఉండిపోవద్దు. దేనికోసం ఇక్కడికి వచ్చానో ఆ మిషన్‌ని విజయవంతంగా పూర్తి చేస్తాను అని చెప్పినట్లు శుభాంశు తండ్రి అన్నారు.
శుభాంశు శుక్లా తల్లిదండ్రుల భావోద్వేగం
June 27, 2025
0
Tags