తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలన ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్‌లకు మాజీ సీఎం కేసీఆర్ మెయింటనెన్స్ చేయలేదని మండిపడ్డారు. ఇవాళ జూరాల ప్రాజెక్ట్‌ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ నేతలు సందర్శించారు. ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను, 4, 8 గేట్ల ఐరన్ రోప్‌లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కమీషన్లకు కక్కుర్తి పడ్డారని ఆరోపించారు. భారీ వాహనాలను జూరాలపై నడపటం సేఫ్టీ కాదని ఆనాడే అధికారులు నిర్థారించారని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. జూరాల డ్యామ్‌కు అనుసంధానంగా మరో బ్రిడ్జికి రూ. 100 కోట్లు ఇప్పుడే మంజూరు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. భారీ వాహనాల వల్ల జూరాల ప్రాజెక్ట్‌కు ప్రమాదం ఉందని తెలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరపున రూ. 100 కోట్లు మరో బ్రిడ్జి నిర్మాణానికి మంజూరు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రాజెక్ట్‌లను పట్టించుకోకపోవడంతోనే దెబ్బతింటున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో పూడికతీత పనులు కూడా చేపట్టలేదని ధ్వజమెత్తారు. జూరాల ప్రాజెక్ట్ పూడికతీత పనులు వెంటనే చేపడతామని స్పష్టం చేశారు. రూ.300 కోట్లతో రెండవ గ్యాంటి క్రెన్ మంజూరు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితెలిపారు. 4 టీఎంసీల నీటిని ర్యాలంపాడు రిజర్వాయర్‌లో నింపేలా పనులు చేపడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ పనులను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 90శాతం పూర్తయినా నెట్టెంపాడు పనులను కూడా కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వంలో నెట్టెంపాడుకి రూ.2,753 కోట్లు మంజూరు చేశామని గుర్తుచేశారు. డిసెంబర్ నాటికి వందశాతం పనులు చేసి నెట్టెంపాడు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మక్తల్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అన్నారు. ఇరిగేషన్ శాఖలో 1100 మంది ఇంజనీర్లను నియమించామని ప్రకటించారు. ప్రతిపక్షాలు సాగు, నీటి ప్రాజెక్ట్‌లపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని హితవు పలికారు. ఇరిగేషన్ శాఖ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించారు !
June 28, 2025
0
Tags