హైదరాబాద్ లోని మాదాపూర్‌లో ఏవీ ఇన్‌ఫ్రా పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఏవీ ఇన్‌ఫ్రాలో పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని, ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని ఏవీ ఇన్‌ఫ్రా చైర్మన్ విజయ్ గోగుల హామీ ఇచ్చాడు. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా తదితర ప్రాంతాల్లో వెంచర్‌లు అంటూ విజయ్ గోగుల నమ్మించాడు. 18 నెలలకు 50శాతం అదనంగా ఇస్తానని చెప్పి చివరికి చేతులెత్తేశాడు. బాధితులు అడిగితే 18 నెలల తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఉందని, అక్కడ ఇస్తానంటూ దాటవేశాడు. బాధితులు గట్టిగా అడిగితే బ్లాంక్ చెక్‌లు ఇస్తూ తప్పించుకొని విజయ్ గోగుల తిరుగుతున్నాడు. సుమారుగా 500 మంది వరకు బాధితులు మోసపోయారు. రూ.500 కోట్ల వరకు ఏవీ ఇన్‌ఫ్రా మోసానికి పాల్పడింది. బాధితుల ఫిర్యాదుతో ఏవీ ఇన్‌ఫ్రా చైర్మన్ విజయ్ గోగులపై మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విజయ్ గోగులపై గతంలోనూ ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విజయ్ గోగుల కాల్ డేటాను, బ్యాంకులావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితులు ఆందోళన చెందవద్దని, న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు
ఏవీ ఇన్‌ఫ్రా పేరిట భారీ మోసం
June 21, 2025
0
Tags