బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వెలుపల జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన ఘటనపై ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓనర్ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్, ఈవెంట్ ఆర్గనైజర్ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు కర్ణాటక హైకోర్టును సోమవారంనాడు ఆశ్రయించాయి. తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలని కోరాయి. తొక్కిసలాటకు దారితీసిన క్రౌడ్ మేనేజిమెంట్‌లో తమ పాత్ర ఏమీ లేదని ఆర్‌సీఎస్ఎల్ తమ పిటిషన్‌లో పేర్కొంది. విక్టరీ సెలబ్రేషన్స్‌కు పరిమితంగానే పాస్‌లు ఉన్నాయని, ఉచిత రిజిస్ట్రేషన్ పాసుల కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తాము చాలా స్పష్టమైన ప్రకటనలు చేసినట్టు తెలిపింది. స్టేడియం గేట్లు తెరవడంలో ఆలస్యం జరిగిందని కూడా ఆరోపించింది. షెడ్యూల్ ప్రకారం 1.45 గంటలకు గేట్లు తెరవాల్సి ఉండగా, 3.00 గంటలకు తెరిచారని, దీంతో ఒక్కసారిగా జనం అక్కడకు చేరుకున్నారని తెలిపింది. డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ మరో పిటిషన్‌లో పోలీసులు, రాష్ట్ర అధికారుల వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆరోపించింది. 3 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చినప్పుడు వారిని కంట్రోల్ చేయడంలో పోలీసులు, రాష్ట్ర అధికారులు విఫలమయ్యారని పేర్కొంది. తగినన్ని పోలీసు బలగాలను మోహరించకపోవడం, లాఠీచార్జి జరపడంతో ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన వారు ఆందోళనకు గురయ్యారని, దీంతో స్టేడియం వెలుపల రోడ్లు, ఫుట్‌పాత్‌లపై తొక్కిసలాట జరిగిందని వివరించింది. ఎక్కువ మంది పోలీసులను విధానసభ వద్దే మోహరించి, స్టేడియం వద్ద తగినంత సిబ్బంది లేకుండా చేసినట్టు కూడా ఆరోపించింది. క్రమశిక్షణా చర్య నుంచి తప్పించుకునేందుకు కుబ్బన్ పార్క్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుమోటో ఫిర్యాదు చేసినట్టు డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ ఆరోపించింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా హడావిడిగా, పక్షపాత వైఖరితో తమపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్టు తెలిపింది. జూన్ 6వ తేదీ ఉదయం ఎలాంటి విచారణ లేకుండానే కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులను అరెస్టు చేసినట్టు పేర్కొంది. నేరుగా తమ తప్పిదం ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లేనందున తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలని ఆర్‌సీఎల్, డీఎన్‌ఏలు తమ పిటిషన్లలో హైకోర్టును కోరాయి.
తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ఆర్‌సీబీ
June 09, 2025
0
Tags