మోడీ హయాంలో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఫాసిస్టు శైలిలో పాలన : మహేష్ గౌ
June 01, 2025
0
మోడీ హయాంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఫాసిస్టు శైలిలో పాలన సాగుతోందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నామని, ఇది శాంతి, రాజ్యాంగం పట్ల విధ్వంసకర చర్యగా భావిస్తున్నామని అన్నారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా చలించని ప్రధానమంత్రి నరేంద్రమోదీ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొట్టికాయలు వేస్తే మాత్రం ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, మన దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని.. ఇదే ప్రజాస్వామ్యానికి మౌలిక సూత్రమని హితవు పలికారు. కాంగ్రెస్ అహింస పునాదులపై నిర్మితమైందని చెప్పారు. హింస ఎవరి నుంచైనా వస్తే దాన్ని తాము ఖండిస్తామని చెప్పుకొచ్చారు. గతంలో ఆర్థిక అసమానతలతో నక్సలిజం పుట్టిందని అన్నారు. ఆ కాలంలో గ్రామాల్లో జరిగిన అఘాయిత్యాలు నక్సలిజం ద్వారా కొంతవరకైనా తగ్గాయని... కానీ క్రమేణ తప్పుదారి పడుతూ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యక్తిగత కక్షలు తీర్చుకునే ప్రయత్నాలకు వేదికగా మారిందని అన్నారు. ఇదే సమయంలో నక్సలిజాన్ని నిర్మూలించేందుకు శాంతియుత పరిష్కార మార్గాలను పరిశీలించకుండా, శాంతి భద్రత సమస్యను సాకుగా చూపి మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట దుశ్చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈ ఆపరేషన్ ద్వారా అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వంలో మతం, కులం పేరిట రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు చేశారు. 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మత సెంటిమెంట్‌ను సాకుగా చూపి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో లౌకికవాద శక్తులు ఏకమవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కమ్యూనిజం భావాలు ఉన్నవారు బలపడాలని కోరారు. దేశం మొత్తం ప్రజాస్వామ్య భావాలు ఉన్న వ్యక్తులు కలిసికట్టుగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కేంద్రంలోని ఫాసిస్టు పాలనకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.
Tags