దేశంలో స్టార్ లింక్ సేవలకు సంబంధించిన ధర ఎంత ఉండొచ్చనే దానిపై చర్చ మొదలైంది. ఇప్పటికే వందకు పైగా దేశాల్లో సేవలందిస్తున్న స్టార్‌లింక్, ఇటీవలే బంగ్లాదేశ్‌లోనూ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇందుకోసం హార్డ్‌వేర్ (డేటా రిసీవర్) ధరను రూ.33 వేలుగా నిర్ణయించింది. నెలవారీ ప్లాన్ ధరలు రూ.3 వేల నుంచి ప్రారంభం అవుతాయి. అదే ధరను భారత్‌లోనూ పెట్టొచ్చని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ-18 తన కథనంలో పేర్కొంది. దేశంలోని ప్రధాన నగరాలు, చిన్న చిన్న పట్టణాల్లో జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్ సేవలందిస్తున్నాయి. ఆయా కంపెనీల మధ్య ఉన్న పోటీ దృష్ట్యా ఉచిత ఇన్‌స్టలేషన్ అందిస్తున్నాయి. 100 ఎంబీపీఎస్ వేగంతో అపరమిత డేటాను వెయ్యి రూపాయల లోపే అందిస్తున్నాయి. వీటికి ఓటీటీ, టీవీ ప్రయోజనాలు అదనం. దీంతో పోలిస్తే స్టార్ లింక్ ధర చాలా ఎక్కువ. అయితే, టెలికాం సిగ్నళ్లు అందని మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో స్టార్ లింక్ సేవలు ఉపయోగపడతాయి. సంప్రదాయ ఉపగ్రహాల నుంచి కాకుండా ఎల్‌ఈఓ (లో ఎర్త్ ఆర్బిట్) ఉపగ్రహాల ద్వారా ఈ సేవలను ఇస్తోంది. ఇవి భూమికి 550 కిలోమీటర్ల ఎగువన ఉంటాయి. ఇలాంటి శాటిలైట్లు స్టార్‌లింక్‌కు 7,000 ఉండగా క్రమంగా వీటి సంఖ్యను 40,000కు పెంచనుంది. ప్రస్తుతం లైసెన్స్ పొందిన సంస్థలు, వాణిజ్య శాట్‌కామ్ స్పెక్ట్రమ్ కోసం మరింత సమయం ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ సేవల కోసం స్పెక్ట్రమ్ ధరలు నిబంధనలు, షరతులపై సిఫారసులను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం తుది మార్గదర్శకాలు నిర్దేశించాక, స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిగితేనే ఈ కంపెనీలు తమ సేవలను ప్రారంభించగలవు. దీనికితోడు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ నుంచి కూడా ఆయా కంపెనీలు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఆపై అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలి. దీంతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభానికి మరో ఏడాది గడువు పడుతుందనేది అంచనా.
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు బహు ప్రియం ?
June 09, 2025
0
Tags