మేం కూడా ఎవరికీ శత్రువులం కాదు, స్నేహితులమే మా భాష కూడా నేర్చుకోండి !

Telugu Lo Computer
0


హిందీ భాష అనేది ఎవరికీ శత్రువు కాదని, ఆ భాషను స్నేహపూర్వకంగా దక్షిణాది రాష్ట్రాలు చూడాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలకు డీఎంకే ఎంపీ కనిమొళి పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు. తాము హిందీ నేర్చుకోవడం సంగతిని కాసేపు పక్కన పెట్టి, ఉత్తరాది వారు తమిళం నేర్చుకుంటే బాగుంటుందని కనిమొళి స్పష్టం చేశారు. అలాగైనా తమిళ భాష జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని ఆమె పేర్కొన్నారు. 'మేం (తమిళులం) కూడా ఎవరికీ శత్రువులం కాదు. మేం కూడా స్నేహితులమే. మా భాష కూడా అంతా నేర్చుకోవచ్చు. ప్రత్యేకంగా నార్త్‌ ఇండియన్స్‌ తమిళం నేర్చుకంటే బాగుంటుంది' అని అమిత్‌ షా పేరును ప్రస్తావించకుండానే తనదైన శైలిలో పేర్కొన్నారు. అంతకుముందు అమిత్‌ షా మాట్లాడుతూ హిందీ భాషను దేశంలోని ప్రతీ ఒక్కరు నేర్చుకోవాలన్నారు. హిందీని ఎవరూ శత్రువుగా భావించొద్దని, అది ఏ భాషకు శత్రువు కూడా కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న 'త్రిభాషా పాలసీ'లో హిందీని తప్పనిసరి చేయడానికి చూడటాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు హిందీ భాషను తమ రాష్ట్రాల్లో రుద్దడాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్‌ సైతం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు తమిళం ఉండగా హిందీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రాజకీయ దురుద్దేశాలతోనే హిందీని తమిళనాడులో పాతాలని చూస్తున్నారని ఇప్పటికే ఎన్నోసార్లు ధ్వజమెత్తారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి సైతం హిందీ భాషను తమ రాష్ట్రంలోకి తీసుకు రావడాన్ని ఖండించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)