తెలంగాణాలో భూ సమస్యలపై 8.58లక్షల దరఖాస్తులు

Telugu Lo Computer
0


భారాస ప్రభుత్వ హయాంలో భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో ఉన్నట్టు తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన సందర్భంగా ఇవాళ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14న భూ భారతి చట్టాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారని, దశలవారీగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. మొదటి విడత ఏప్రిల్‌ 17 నుంచి 30వ తేదీ వరకు నాలుగు మండలాల్లో, రెండో విడతలో మే 5 నుంచి 28 వరకు 28 మండలాల్లో, మూడో విడతలో ఈనెల 3 నుంచి 20 వరకు మూడో విడతలో సదస్సులు నిర్వహించినట్లు వివరించారు. ఈ మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 8.58 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67వేలు, భద్రాద్రి కొత్తగూడెంలో 61వేలు, వరంగల్‌లో 54 వేలు, జయశంకర్ భూపాలపల్లిలో 48వేలు, నల్గొండలో 42 వేల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులకు ముందురోజే ఆయా గ్రామాల్లో రైతులకు ఉచితంగా దరఖాస్తులు ఇచ్చామని, ఎమ్మార్వోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరించారని వివరించారు. స్వీకరించిన వాటికి రశీదులు అందజేయడం జరిగిందని, వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. మిగిలిన వాటిని కూడా త్వరితగతిన ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)