ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో చెరువులో ఈతకు దిగిన ఐదుగురు బాలురు మృతిచెందారు. మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మృతి చెందిన చిన్నారులను చరణ్ (15), దీక్షిత్ (12), హర్ష (12), పార్థు (12), తరుణ్ యాదవ్ (10) గా గుర్తించారు. వేసవి సెలవులు రావడంతో మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్ ఇంటికి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్ నుంచి తమ పిల్లలతో కలిసి వచ్చారు. పిల్లలు సరదాగా చెరువుకు వెళ్లి ఈత కొడదామనుకున్నారు. సావిత్రి కుమారుడు హర్ష, భవాని పిల్లలు చరణ్, పార్థు, మల్లేపల్లె గ్రామానికి చెందిన మేకల గంగాధర్ కుమారుడు తరుణ్ యాదవ్, కాశినాయన మండలం మల్లేరు కొట్టాలకు చెందిన నారాయణ కుమారుడు దీక్షిత్ మల్లేపల్లిలోని చెరువు వద్దకు వెళ్లారు. రాత్రి అయినా పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. చెరువు ఒడ్డున పిల్లల బట్టలు కనిపించడంతో దాంతో బాలురు చెరువులో గల్లంతైనట్లు భావించారు. పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి 11 గంటల తర్వాత బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తో పాటు ఎస్ఐ శివప్రసాద్ అక్కడికి చేరుకుని పరిశీలించారు.
చెరువులో ఈతకు దిగి ఐదుగురు చిన్నారులు మృతి
May 14, 2025
0
Tags