ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు రుణాలు అందించేందుకు పలు విదేశీ బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) ప్రతినిధులు మెట్రో కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డితో బుధవారం సమావేశమయ్యారు. రెండు చోట్లా మొదటి దశ పనులకు రూ.12 వేల కోట్ల రుణం అవసరమని ఎండీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్) పంపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈలోగా ముందస్తు ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు వివరించారు. ఎండీతో సమావేశం ముగిశాక ఏఐఐబీ ప్రతినిధులు విజయవాడలో ప్రతిపాదిత మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన పలు ప్రాంతాలను పరిశీలించారు. కేఎఫ్‌డబ్ల్యూ, ఏఎఫ్‌డీ, ఏడీబీ, ఎన్‌డీబీ, జైకా, ప్రపంచ బ్యాంకు కూడా మెట్రో రైల్ ప్రాజెక్టులకు రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నామని ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోనూ విదేశీ బ్యాంకుల ప్రతినిధులు త్వరలో చర్చలు జరపనున్నారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టుల ప్రతిపాదనలను గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టి నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు చోట్లా ప్రాజెక్టు పనుల కోసం తాజాగా మళ్లీ సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ ప్రాజెక్టులకు కేంద్రమే 100% నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.
మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డితో ఏఐఐబీ ప్రతినిధుల సమావేశం
May 15, 2025
0
Tags