ముంబయిని ముంచెత్తిన భారీ వర్షం- కేరళలో రెడ్‌ అలర్ట్‌ - ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ

Telugu Lo Computer
0


నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళ ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు ఆదివారం బీభత్సం సృష్టించాయి. దీంతో వయనాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది. మరో వైపు మహారాష్ట్రలోని ముంబయిలో కూడా అదే పరిస్థితి నెలకొంది. సోమవారం ప్రజలను ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులపై ప్రభావం పడింది. అటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఇండియా సహా పలు ఎయిర్‌లైన్లు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను పరిశీలించాలని సూచించాయి. దాదార్, మహిమ్‌, పరెల్‌, బాంద్రా, కాలాచౌకీతో పాటు ఇతర ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నగరంలో అక్కడక్కడ ఓ మాదిరి వర్షం కురుస్తోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన వానతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఢిల్లీ కంటోన్మెంట్, ధౌలా కువాన్, సుబ్రోతో పార్క్, నానక్‌ పురాలు నీటిలో మునిగిపోయాయి. విమానాల రాకపోకలపై కూడా ప్రభావం పడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)