పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన

Telugu Lo Computer
0


పాక్ వైపు మళ్లుతున్న తుర్కియే తన విధానాన్ని పునరాలోచించుకోవాలని లోక్‌సభ ఎంపీ, ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హితవు పలికారు. తుర్కియే, భారత్‌ల మధ్య చారిత్రక సంబంధాలున్న విషయాన్ని గుర్తు చేశారు. పాక్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. భారత్‌లో కూడా 200 మిలియన్ ముస్లింలు గౌరవప్రదంగా జీవిస్తున్న విషయం మరిచిపోవద్దని వ్యాఖ్యానించారు. తుర్కీయే అభివృద్ధికి భారత్ గతంలో తోడ్పాటును అందించిందని కూడా అన్నారు. ''పాక్ మద్దతుగా నిలుస్తున్న తుర్కియే తన విధానాన్ని పునః సమీక్షించుకోవాలి. తుర్కియేలో ఇస్‌బాంక్ అని ఒకటి ఉంది. అక్కడ మొదట్లో అనేక మంది భారతీయులు ఖాతాలు తెరిచారు. తుర్కియే, భారత్ మధ్య చారిత్రక సంబంధం ఉంది. భారత్‌లో 200 మిలియన్‌ల మంది ముస్లింలు సగౌరవంగా జీవిస్తున్న విషయాన్ని తుర్కియే గుర్తించాలి. పాక్ కంటే భారత్‌లోనే ముస్లింల సంఖ్య ఎక్కువ. పాక్ వ్యవహరిస్తున్న తీరుకు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదు'' అని అన్నారు. తనను పాక్ జాతీయులు విమర్శిస్తుండటంపై కూడా ఒవైసీ దీటుగా బదులిచ్చారు. ''నా లాగా నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారిని పాకిస్థానీలు ఇప్పటివరకూ ఎప్పుడూ చూడలేదు. నా లాంటి వాళ్లు ఇండియాలో మాత్రమే ఉంటారు. వాళ్లు నేను చెప్పేది జాగ్రత్తగా వింటుండాలి. అప్పుడే వారి అవగాహన పెరిగి అజ్ఞానం తొలగిపోతుంది'' అని అన్నారు. ప్రపంచ శాంతికి పాకిస్థాన్ ముప్పుగా మారిందని ఒవైసీ ఉన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశంగా మారిందని అన్నారు. జియా ఉల్ హక్ పాలనలో పాక్‌లో చోటుచేసుకున్న మారణహోమం ప్రపంచమంతా చూసిందని అన్నారు. ఇతర దేశాలకు తాను ఇదే విషయాన్ని చెబుతానని అన్నారు. పాక్ తనని తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకోవడాన్ని కూడా కొట్టి పారేశారు. దీర్ఘకాలిక ఎజెండా ప్రకారం, పాకిస్థానీ మిలిటరీ భారత్‌లో అస్థిరతను ప్రోత్సహిస్తోందని అన్నారు. 1947లో పాక్ గిరిజన ఆక్రమణదారులను జమ్మూకశ్మీర్‌పై ఉసిగొల్పినప్పుడే దయాది దురుద్దేశాన్ని అర్థం చేసుకుని ఉండాల్సిందని అన్నారు. భారత్, పాక్ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ఒవైసీ విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)