ఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కుల గణన, మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుండడం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన అంశాలు ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తుండడంతో దానికి సంబంధించిన వివరాలను సీఎంలు, డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. తమ తమ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వివరించారు. పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించారు. ఆపరేషన్ సిందూర్‌లో ప్రధాని మోడీ నాయకత్వాన్ని, సాయుధ దళాల పరాక్రమాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం తీసుకురాగా, దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేశారు. సమావేశంలో భాగంగా.. ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ సహా విపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టే అంశంపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రధాని సాయుధ దళాలకు అధికారాను ఇచ్చి ముందుకు నడిపించారని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులకు, వారిని పోషిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పిందని అన్నారు.
ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ
May 25, 2025
0
Tags