ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ప్రతీ పేద కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరకులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 8గంటల వరకు చౌక ధరల దుకాణాలు అందుబాటులో ఉంటాయన్నారు. ''పేదలకు రేషన్ సరకులు అందించే చౌకధరల దుకాణాలను గత ప్రభుత్వం మూసివేసింది. ఇంటింటికీ అందిస్తామని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేశారు. ఇంటింటికీ ఇవ్వడం మానేసి నెలలో ఒకటి రెండ్రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతో మంది పేదలు సరకులు అందక ఇబ్బందులు పడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకు సెలవులు పెట్టుకోవాల్సి వచ్చేది. మిగిలిన రేషన్ బియ్యం, సరకులను అక్రమంగా తరలిస్తున్న విషయం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకుంది. వీటిని అరికట్టేందుకు చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరకులు అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది'' అని పవన్ కల్యాణ్ తెలిపారు.
ప్రతీ పేద కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరకులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : పవన్ కల్యాణ్
May 31, 2025
0
Tags