రాష్ట్రీయ జనతాదళ్ నుంచి ఆరేళ్లపాటు తేజ్ ప్రతాప్ యాదవ్‌ బహిష్కరణ

Telugu Lo Computer
0


రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమ కుమారుడు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించేలా చేస్తున్న చర్యలు సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న సమష్టి పోరాటాన్ని బలహీనపరుస్తున్నాయని లాలూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేదని అన్నారు. ఈ కారణాల వల్ల అతడిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై తేజ్‌ ప్రతాప్‌కు ఆర్జేడీ పార్టీలో, తమ కుటుంబంలో స్థానం లేదని స్పష్టం చేశారు. శనివారం తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌బుక్‌లో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో లాలూ ప్రసాద్‌ ఈ చర్యలు తీసుకున్నారు. తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌బుక్‌లో శనివారం ఒక పోస్టు ప్రత్యక్షమైంది. ఆయన ఒక మహిళతో ఉన్న ఫొటో దానిలో ఉంది. ఆమె పేరు అనుష్క యాదవ్‌ అని, గత 12 ఏళ్లుగా తాము రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అనంతరం దీనిపై ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇస్తూ తన సోషల్‌ మీడియాను ఎవరో హ్యాక్‌ చేశారని తెలిపారు. తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్టు చేశారని ఆరోపించారు. ఆ ఫొటో సైతం ఎడిట్ చేసిందని వెల్లడించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తన అభిమానులను కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)