భారత్‌, పాకిస్థాన్‌లు చర్చలు పునఃప్రారంభించాలి !

Telugu Lo Computer
0

భారత్‌-పాక్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఇరుదేశాలు పరస్పర చర్చలు జరపాలని రష్యా  భారత్‌కు సలహాను ఇచ్చింది. ''ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలపై భారత్‌ -పాక్‌ ప్రత్యక్ష శాంతి ఒప్పంద చర్చలు జరపాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో ఇరుదేశాలు పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం'' అని రష్యన్ ఫెడరేషన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం భారత్‌-పాక్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా స్పందిస్తూ..భారత్, పాక్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించింది. భారత్, పాక్‌ సంఘర్షణ నివారణకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ శాంతి మార్గాన్ని ఎంచుకోవడాన్ని అభినందిస్తున్నామని వ్యాఖ్యానించింది. భారత్‌, పాక్‌ ప్రత్యక్ష చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోలు కోరుకుంటున్నారని తెలిపింది. భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు తమ మద్దతు పాక్‌కే అని తెగేసి చెప్పిన చైనా ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణను మాత్రం సమర్థిస్తున్నట్లు పేర్కొంది. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించింది. ఈ విషయంపై భారత్‌ స్పందిస్తూ..పాకిస్థాన్‌తో చర్చలు ద్వైపాక్షికంగానే జరుగుతాయని, ఉగ్రవాదంపై మాత్రమే చర్చలుంటాయని స్పష్టం చేసింది. మరో వైపు భారత్‌తో చర్చలకు పాక్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. శాంతి కోసం దీనిని ప్రతిపాదిస్తున్నామని, అయితే కశ్మీర్‌ అంశం కూడా చర్చల్లో చేర్చాలనేది తమ షరతు అని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)