ఆంధ్రప్రదేశ్ లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏవియేషన్ హబ్ నిర్మాణంలో భాగంగా సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఐఏఎల్ సంస్థకు 500 ఎకరాల భూ కేటాయింపునకు రాష్ట్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపింది. మాస్టర్‌ప్లాన్ ప్రకారం విమానాశ్రయం అభివృద్ధి కోసం 1,733 ఎకరాలు, జాతీయ రహదారి నుంచి విమానాశ్రయ అనుసంధానం కోసం 92 ఎకరాల మేర ప్రతిపాదన చేశారు. విమానాశ్రయంలో కార్గో ఏరియా కోసం 83.5 ఎకరాలు, నార్త్ టెర్మినల్ భవనం కోసం 98 ఎకరాలు, ఎయిర్ పోర్టు బౌండరీ కోసం 494 ఎకరాల మేర ప్రతిపాదించారు. నివాస ప్రాంతం, ఇతర అవసరాల కోసం 201 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏటా 36 మిలియన్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా మూడు దశల్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దీని ప్రకారం 2,703 ఎకరాలు కేటాయించాల్సి ఉన్నా.. వైకాపా ప్రభుత్వం 2,203 ఎకరాలు మాత్రమే కేటాయించింది. ప్రస్తుతం ప్రాజెక్టు వయబిలిటీతో పాటు భవిష్యత్ అవసరాలు, సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
భోగాపురం ఎయిర్‌పోర్టుకు 500 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ
May 22, 2025
0
Tags