ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. కార్ల అమ్మకాలు క్షీణించడం, నష్టాలు పెరగడంతో కఠిన చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో దాదాపు 20 వేల మందికి ఉద్వాసన పలకాలని యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో అమెరికా, చైనాల్లో పేలవమైన విక్రయాల కారణంగా లాభాల్లో 94% క్షీణత నమోదు కావడంతో 9వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. కానీ, ఇప్పుడు ఏకంగా రెట్టింపు ఉద్యోగాలకు కోత విధిస్తుందంటూ జపాన్ జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కే పేర్కొనడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 700-750 బిలియన్ యెన్‌ల నికర నష్టం రావొచ్చని కంపెనీ ఇటీవల పేర్కొంది. జపాన్‌లో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఉన్న వందల మంది ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే.. 18 ఏళ్లలో ఆ కంపెనీ ప్రవేశపెట్టిన తొలి ముందస్తు పదవీ విరమణ ప్రణాళిక ఇదే కానుండటం గమనార్హం. అయితే, ఈ తరహా వార్తలపై నిస్సాన్ అధికారికంగా ఇంకా స్పందించలేదు.
నిస్సాన్‌లో 20 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన ?
May 12, 2025
0
Tags