కర్రెగుట్టలో మావోయిస్టుల బంకర్‌ను గుర్తించిన భద్రతా బలగాలు

Telugu Lo Computer
0


తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ మధ్య ఆపరేషన్ కర్రె గుట్టల్లో భాగంగా భద్రతా బలగాలు మావోయిస్టుల కీలక స్థావరమైన బంకర్‌ను గుర్తించాయి. ఆ గుహలో దాదాపు వెయ్యి మంది సురక్షితంగా ఉండేలా ప్రదేశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. గుహలో నీటి సౌకర్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి మకాం మార్చినట్టు సమాచారం. మరోవైపు కర్రె గుట్టలో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదరవుతున్నాయి. తాజాగా బంకర్‌ (గుహ)కు సంబంధించి వీడియోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి. ఇదిలా ఉండగా కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఐదో రోజు కూంబింగ్‌ కొనసాగించాయి. సాయంత్రం 4 గంటలు కాగానే చీకటి పడటం 5 అడుగుల దూరంలో మనిషి కూడా కనిపించనంత దట్టమైన అడవి ఉండటంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితంగా భావిస్తారు. ఇలాంటి చోట ఆపరేషన్‌ బలగాలకు కత్తిమీద సాముగా మారింది. గల్గం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఒక డీఆర్‌జీ జవాన్‌కు గాయాలు కాగా బీజాపుర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్‌ కొనసాగుతోంది. రుద్రారం వరకు 90 కి.మీ. పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)