బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సదస్సు కోసం థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ ఆ దేశ ప్రధానమంత్రి పీటోంగ్టార్న్ షినవాత్ర్‌తో గురువారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి ఉన్నతీకరించుకోవాలని ఇరు దేశాలు తాజాగా నిర్ణయించుకున్నాయి. పర్యాటకం, విద్య, పెట్టుబడులు, సాంస్కృతిక వ్యవహారాలు సహా పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై విస్తృతంగా చర్చించారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజీత్ డోభాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, చేనేత, హస్తకళల రంగాల్లో సహకారానికి సంబంధించి ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. భేటీ అనంతరం షినవాత్ర్‌తో కలిసి మోడీ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భారత యాక్ట్ ఈస్ట్, ఇండో-పసిఫిక్ విధానాల్లో థాయ్‌లాండ్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇరు దేశాలూ బలంగా కోరుకుంటున్నాయని ఉద్ఘాటించారు. తాము అభివృద్ధివాదాన్నే విశ్వసిస్తాం తప్ప విస్తరణవాదాన్ని కాదంటూ పరోక్షంగా చైనాకు చురకలంటించారు. భారత్, థాయ్‌లాండ్‌లది శతాబ్దాల నాటి బంధమని మోడీ అన్నారు. థాయ్ ప్రజల జీవితాల్లో రామాయణం భాగమని పేర్కొన్నారు. బౌద్ధమతం వ్యాప్తి ఇరు దేశాల పౌరులను అనుసంధానించిందని వ్యాఖ్యానించారు. తన పర్యటన నేపథ్యంలో రామాయణ కుడ్యచిత్రాల ఆధారంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను థాయ్‌లాండ్ విడుదల చేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మోదీకి 'త్రిపీఠక' (బుద్ధుడి బోధనలు)ను షినవాత్ర్ బహూకరించారు.
థాయ్‌లాండ్‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం !
April 04, 2025
0
Tags