కర్ణాటక లోని బెళగావిలో సోమవారం అధికార కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. భారీగా జనం హాజరైన ఈ సభలో పలువుర వ్యక్తులు తమ నిరసన తెలిపారు. అలాగే నల్ల జెండాలు సైతం ఎగరవేశారు. ఈ దృశ్యాన్ని చూసిన సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఈ సభను పర్యవేక్షించే పోలీస్ ఉన్నతాధికారి ఎవరు? ఎక్కడ? అంటూ అక్కడ ఉన్న వారిని ఆయన ప్రశ్నించారు. ఇంతలో పోలీస్ ఉన్నతాధికారి సీఎం సిద్దరామయ్య వద్దకు వచ్చారు. సీఎం అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తుండగానే సిద్ధరామయ్య చెయ్యి పోలీస్ అధికారి చెంప మీదకు వెళ్లింది. ఈ విషయాన్ని గమనించి పోలీస్ ఉన్నతాధికారి కాస్తా వెనక్కి అడుగు వేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో,సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే సదరు పోలీస్ అధికారి పేరు నారాయణ భారమణి. ఆయన ధర్వాడ్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. సీఎం సిద్దరామయ్య వ్యవహార శైలిపై విపక్షాలు మండిపడుతోన్నాయి. ప్రతిపక్ష జేడీ (ఎస్)అయితే తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించింది. అధికారం శాశ్వతం కాదని హెచ్చరించింది. పోలీసు అధికారిని కొట్టడానికి చేయి ఎత్తడం వల్ల మీ పదవికి లేదా గౌరవానికి ఎటువంటి కీర్తి రాదంది. మీ పదవీకాలం ఐదు సంవత్సరాలు మాత్రమే అని గుర్తు చేసింది. కానీ ప్రభుత్వ అధికారి 60 సంవత్సరాల వయస్సు వరకు పనిచేస్తారని వివరించింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మీ దుష్ప్రవర్తనను సరిదిద్దుకోండంటూ చురకలంటించింది. ఇక కర్ణాటక బిజెపి అధికార ప్రతినిధి విజయ్ ప్రసాద్ సైతం సీఎం సిద్దరామయ్య వ్యవహారశైలిని తప్పు పట్టారు. పోలీస్ అధికారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలీస్ అధికారిపై చేయెత్తిన సిద్దరామయ్య
April 28, 2025
0
Tags