తెలంగాణలోని ఖాజీపేట్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం సగానికి పైగా పూర్తయింది. తుదిదశకు చేరుకుంటోంది. 160 ఎకరాల విస్తీర్ణంలో ఖాజీపేట్ వద్ద నిర్మితమౌతోంది. దీని నిర్మాణ వ్యయం 716 కోట్ల రూపాయలు. ఇక్కడ వ్యాగన్లు తయారు కానున్నాయి. సంవత్సరానికి 2,400 వ్యాగన్ల తయారీ సామర్థ్యంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం కొనసాగుతోంది. 2023 జులై 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఆర్ఎంయు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తొలుత దీన్ని వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్, పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ యూనిట్‌గా ప్రతిపాదించారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం దీని స్థాయిని పెంచింది. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా బదలాయించింది. దీనికి సంబంధించిన వివరాలు, ఫొటోలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో 68 శాతం మెయిన్ షాప్ అంటే వ్యాగన్ల తయారీ కోసం కేటాయించిన యూనిట్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన వాటిల్లో పెయింట్ వర్క్‌షాప్- 57, స్టోర్ వార్డు- 92, పిట్ ట్రావెర్సెస్-57, టెస్ట్ షాప్- 45 శాతం మేర నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. మరో ఏడాది కాలంలో నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ జోన్లకు ఇక్కడి నుంచే రైల్వే వ్యాగన్లు సరఫరా కావడం ఖాయంగా కనిపిస్తోంది. సంవత్సరానికి 2,400 వ్యాగన్లను తయారు చేయాలంటూ రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోన్న నేపథ్యంలో- వీటి కొరత తీరుతుందని జీ కిషన్ రెడ్డి చెప్పారు.
తుది దశకు చేరుకున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ?
March 09, 2025
0
Tags