ఎల్‌ఐసీలో వాటాను విక్రయించే యోచనలో ప్రభుత్వం ?

Telugu Lo Computer
0


జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలో వాటాను విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో 2-3 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. 2027 నాటికి పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ను 10 శాతానికి చేర్చాలనే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సెబీ నిబంధనల ప్రకారం 2027 నాటికి ఎల్‌ఐసీ తప్పనిసరిగా పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ను 10 శాతానికి చేర్చాల్సిఉంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే సంస్థలో 2-3 శాతం వాటాను విక్రయించాల్సి ఉంటుంది. 2025- 26 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌లో సానుకూల పరిస్థితులను బట్టి బీమా సంస్థలో వాటాను విక్రయించేందుకు కేంద్రం భావిస్తోందని సమాచారం. ఈ వాటా విక్రయాన్ని బహుళ చిన్న విడతలుగా అమలుచేయొచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 2022 మే నెలలో ఎల్‌ఐసీ లిస్టింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాకు సమానమైన రూ.22.13 కోట్ల షేర్లను ప్రభుత్వం ఐపీఓ రూపంలో విక్రయించింది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఎల్‌ఐసీ 96.5 శాతం వాటా ఉంది. 2-3 శాతం వాటా విక్రయం ద్వారా రూ.9,500 కోట్ల నుంచి రూ.14,500 కోట్ల వరకు నిధుల్ని సమకూర్చుకొనే అవకాశం ఉంది. 2024 మే నాటికి ఎల్‌ఐసీ కనీస పబ్లిక్‌ వాటా 10 శాతానికి చేర్చాలని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI) ఆదేశించింది. ఆ తర్వాత ఆ గడువును 2027 మే16 కి పొడిగించింది. ప్రస్తుతం ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ సుమారు రూ.4.8 ట్రిలియన్లు. 

Post a Comment

0Comments

Post a Comment (0)