తెలంగాణలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విప్లవాత్మకమైందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖమంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిరుపేదలందరికి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం భారతదేశంలోనే సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించబోతుందని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు లేని పేదలకు కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. శుక్రవారం సాయంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 84 శాతానికి పైగా ప్రజలకు ఆహార భద్రత కల్పించడం స్వతంత్ర భారత దేశంలోనే ఇదే ప్రప్రథమం కావచ్చని అన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవ వేదికకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాంగణంగా నామ కరణం చేశామన్నారు. సన్న బియ్యం పంపిణీతో 3.5 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. సన్నబియ్యం పంపిణీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10,655 కోట్లు ఖర్చు పెడుతున్నాయని అన్నారు. అందులో రాష్ట్రం వాటా రూ.5,175 కోట్లు, కేంద్రం వాటా రూ.5,485 కోట్లు అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించ నున్న ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2,858 కోట్ల భారం పడుతుందన్నారు. అయినా పేదల కడుపు నింపేందుకు ఉద్దేశించ బడిన ఈ పథకం ఎంత ఖర్చయినా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. కేవలం సన్నబియ్యంతో సరిపెట్టకుండా ఇతర నిత్యావసర సరుకులను కూడా ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా అందించనుందన్నారు. తెల్ల రేషన్ కార్డు ఎక్కడ ఉన్నా లబ్ధిదారులకు అన్ని చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం అందిస్తామని అన్నారు. సన్నాలను ప్రోత్సహించిందే పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ కోసమని ఆయన చెప్పారు. అందుకే ఖరీఫ్ సీజన్ 2024-25లో రికార్డు స్థాయిలో 24 లక్షల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు అని వివరించారు. అర్హులైన నిరుపేదలం దరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరికు త్వరలోనే ముహూర్తం ఖరారు చేయనున్నట్టు చెప్పారు. కొత్తగా 30 లక్షల మందికి లబ్ది జరుగుతుందనీ, తద్వారా తెల్ల రేషన్ కార్డులు కోటికి చేరడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందని ఆయన అన్నారు.
సన్నబియ్యంతోపాటు నిత్యావసర సరుకులు !
March 29, 2025
0
Tags