ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కేంద్రం ఆదేశించింది. ఈమేరకు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది.మార్చి 22 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ''భారత యువతకు ఆదర్శంగా ఉండే క్రికెట్ ఆటగాళ్లకు ఏ రకమైన పొగాకు లేక మద్యం ప్రకటనలతో సంబంధం ఉండకూడదు. ఐపీఎల్, సంబంధిత కార్యక్రమాలు జరిగే స్టేడియం ప్రాంగణాలు, జాతీయ మీడియాలో ప్రసారమయ్యే సెషన్‌ల సమయంలో పొగాకు, మద్యం ప్రకటనలు ఇవ్వొద్దు. అమ్మకాలపై కూడా నిషేధం ఉంది. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి'' అని కేంద్రం ఆదేశించింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. మార్చి 23న ఉప్పల్ వేదికగా హైదరాబాద్ - రాజస్థాన్ జట్ల మధ్య పోరు ఉండనుంది. ఈ సమయంలో క్రికెట్ అభిమానులు టీవీలు, మొబైళ్లను వదలరు. దాంతో ఐపీఎల్‌పై అడ్వటైజర్లు ఎక్కువ దృష్టిపెడుతుంటారు. ఈనేపథ్యంలోనే కేంద్రం నుంచి స్పందన వచ్చింది. ''ప్రతి ఏడాది భారత్‌లో సంభవిస్తోన్న 70 శాతం మరణాలకు దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, ఊపిరితిత్తుల సంబధిత వ్యాధులు, హైపర్‌టెన్షన్, మధుమేహం కారణమవుతున్నాయి. పొగాకు, ఆల్కహాల్ వాడకం ఈ దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తున్నాయి. పొగాకు సంబంధిత మరణాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది'' అని కేంద్రం పేర్కొంది.
ఐపీఎల్‌లో పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కేంద్రం ఆదేశం !
March 10, 2025
0
Tags