ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తండ్రి కత్తితో దాడి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తండ్రి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుడుపల్లి మండలం అగరం కొత్తపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, అదే గ్రామానికి చెందిన కౌసల్య ప్రేమించుకున్నారు. ఈ నెల 3న పెద్దల అంగీకారం లేకుండా తమిళనాడు లోని తిరుపత్తూరు జిల్లా యాదగిరి హిల్స్‌పై ఉన్న ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం భవిష్యత్తులో గొడవలేం లేకుండా తమ వాళ్లతో మాట్లాడాల్సిందిగా ప్రేమ జంట గ్రామ పెద్దలను ఆశ్రయించింది. వారి ప్రేమ పెళ్లి విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ మేరకు గ్రామ పెద్దలు కౌసల్య, చంద్రశేఖర్‌తోపాటు కౌసల్య తండ్రి శివశంకర్‌ను కూడా పంచాయితీకి పిలిచారు. కుప్పంలోని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో రాజీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టంలేని శివశంకర్‌ పెద్దల సమక్షంలోనే కత్తితో కౌసల్య, చంద్రశేఖర్‌లపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఊహించని ఘటనతో అంతా షాక్‌కి గురయ్యారు. శివశంకర్‌ను ఆపే ప్రయత్నంలో చంద్రశేఖర్‌ మేనమామ రమేష్‌, పంచాయితీ పెద్ద మనిషిగా వ్యవహరించిన సీతా రామప్పపై కూడా ఆయన దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కౌసల్య, చంద్రశేఖర్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)