కర్ణాటక బీజేపీ సీనియర్ నేత బసనగౌడ పాటిల్ యత్నాల్‌పై ఆ పార్టీ బుధవారంనాడు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంగా ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. పార్టీ పలుమార్లు హెచ్చరించినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడంతో పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నామని పేర్కొంటూ పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ అధికారికంగా బసనగౌడ పాటిల్ యత్నాల్‌కు ఒక లేఖలో తెలియజేసింది. బసవగౌడ పాటిల్ యత్నాల్ కొద్దికాలంగా పదేపదే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యారావుపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్రపై కూడా ఆయన కయ్యానికి కాలుదువ్వారు. విజయేంద్ర అవినీతి, ఎడ్జెట్‌మెంట్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. దీనిపై గత ఫిబ్రవరిలో కేంద్ర క్రమశిక్షణా కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు పంపింది. తాజాగా దీనిపై చర్య తీసుకుంటూ ఆయనపై పార్టీ బహిష్కరణ వేటు వేసింది. యత్నాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం ద్వారా అంతర్గత క్రమశిక్షణకు పార్టీ కట్టుబడి ఉంటుందని బీజేపీ సంకేతాలు ఇచ్చింది.
కర్ణాటకలో బీజేపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ బహిష్కరణ !
March 26, 2025
0
Tags