ఎలాంటి బలవంత ప్రయోగాలకు పాల్పడలేదు : ఇన్ఫోసిస్‌

Telugu Lo Computer
0


న్ఫోసిస్‌ ట్రైనీలను బెదిరించి  మైసూరు క్యాంపస్‌ నుంచి బయటకు పంపారంటూ వచ్చిన వార్తలను ఇన్ఫోసిస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రీసోర్సెస్‌ ఆఫీసర్‌ షాజీ మాథ్యూ ఖండించారు. బౌన్సర్లను పెట్టి బయటకు గెంటించడమనేది అసత్య ప్రచారమన్నారు. ఉద్దేశపూర్వకంగా ఫెయిల్‌ చేసేందుకు కఠినంగా పరీక్ష నిర్వహించారంటూ వచ్చిన ఆరోపణలనూ తోసిపుచ్చారు. ''ఎంతో శ్రమకోర్చి వారికి శిక్షణ ఇస్తాం. పైగా వారికి శిక్షణ సమయంలో జీతం చెల్లిస్తాం. అలాంటి వారిని వెళ్లనివ్వడం వారికే కాదు కంపెనీకి మంచిది కాదు'' అని మాథ్యూ పేర్కొన్నారు. వరుసగా మూడు ఎవాల్యుయేషన్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన వారినే తొలగించినట్లు ఆయన వెల్లడించారు. ఫ్రెషర్లను తొలగించడంపై ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్‌ కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. కార్మిక శాఖ ఆదేశాల మేరకు కర్ణాటక కార్మిక శాఖ ఇన్ఫోసిస్‌పై దర్యాప్తు చేపట్టింది. దీనిపై మాథ్యూ స్పందిస్తూ ''కార్మిక శాఖ మాతో సంప్రదింపులు జరుపుతోంది. మా శిక్షణ ప్రక్రియ, మూల్యాంకనం మొదలైన వాటిని అర్థం చేసుకుంటున్నారు. వారికి పూర్తిగా సహకరిస్తున్నాం'' అని తెలిపారు. తొలగించిన వారిని తిరిగి నియమించుకొనే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 వేల మంది ఫ్రెషర్‌లను నియమించుకునే అవకాశం ఉందని తెలిపారు. వారందరికీ అత్యుత్తమ శిక్షణ లభిస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)