జైల్లో నన్ను ఒంటరిగా ఉంచొద్దని జడ్డిని అభ్యర్ధించిన వల్లభనేని వంశీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులో అరెస్టు అయి రిమాండ్ పై ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీలో వంశీ పలు కీలక విషయాలు వెల్లడించారు. అయితే ఇంకా పలు విషయాలు ఆయన నుంచి రాబట్టాల్సి ఉండటంతో మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ సబ్ జైల్లో తనకు అదనపు సౌకర్యాలు కావాలని వల్లభనేని వంశీ గతంలో కోరడంతో ఆయనకు వెస్ట్రన్ కమోడ్ తో పాటు పడుకునేందుకు దిమ్మె ఉన్న రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే వంశీని సింగిల్ గా ప్రత్యేక రూమ్ లో పెట్టడంపై జడ్జి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జైల్లో ఇతర బ్యారెక్స్ లో ప్రమాదకర ఖైదీలు ఉన్నారని, వంశీ భద్రత దృష్ట్యా ఆయనకు ప్రత్యేక గది కేటాయించినట్లు తెలిపారు. కానీ ఇప్పుడు వంశీ తనకు ప్రత్యేక గది వద్దంటున్నారు. ఇవాళ మూడు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపర్చారు. దీంతో కస్టడీలో ఇబ్బంది పెట్టారా అని వంశీని న్యాయమూర్తి అడిగారు. దీనిపై స్పందించిన వంశీ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని జడ్డికి తెలిపారు. అదే సమయంలో వేరే బ్యారక్‌లో తనకు వసతి కల్పించాలని వంశీ కోరారు. ఒక్కడినే కాకుండా మిగతా ఖైదీలతో కలిపి ఉంచాలని వంశీ న్యాయమూర్తిని కోరారు. దీంతో మెమో దాఖలు చేయాలని వంశీకి కోర్టు సూచించింది. అలాగే వంశీ మెడికల్‌ రిపోర్టుల్ని పోలీసులు కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం వంశీ ఉంటున్న రూమ్ లో ఆయన ఒక్కరే ఉంటున్నారు. కానీ జైల్లో తనకు భద్రత లేదని కుటుంబ సభ్యులతో వంశీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కారణంతో ఆయన తనను ఒంటరిగా ఉంచవద్దని, మిగతా ఖైదీలతో కలిపి ఉంచమని ఇవాళ జడ్డిని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)