జెలెన్‌స్కీ నేతృత్వంలో ఉక్రెయిన్‌ అతి పెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయింది : డొనాల్డ్‌ ట్రంప్‌

Telugu Lo Computer
0


మెరికా, ఫ్లోరిడాలోని తన భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా సౌదీలో మొదలైన శాంతిచర్చల్లో కీవ్‌ను భాగం చేయకపోవడంపై వస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. ''యుద్ధాన్ని ముగించే శక్తి నాకుందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు అంతా సజావుగానే జరుగుతోంది. 'మంచిది. మమ్మల్ని ఆహ్వానించలేదు' అన్న వ్యాఖ్యలను నేను విన్నాను. సరే నువ్వు అక్కడ మూడేళ్ల నుంచి ఉన్నావు. నువ్వే ఈ మూడేళ్లలో యుద్ధాన్ని ముగించాల్సింది. అసలు నువ్వు దీనిని మొదలు పెట్టుండాల్సింది కాదు. మీరే ఓ డీల్‌ చేసుకొని ఉండొచ్చు. నేను ఉక్రెయిన్‌ కోసం ఓ ఒప్పందం కుదర్చగలను. అది పోగొట్టుకొన్న దాదాపు మొత్తం భూమిని తిరిగి ఇప్పించగలను. ప్రజలు ఎవరూ చనిపోరు. ఏ నగరం నేలమట్టం కావాల్సిన అవసరం రాదు. ఒక్క ఇంటి పైకప్పు కూడా కూలదు. కానీ, వారు అలా జరగకూడదనుకొన్నారు'' అని ట్రంప్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఉద్దేశించి అన్నారు. అతడి నేతృత్వంలో ఉక్రెయిన్‌ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని మండిపడ్డారు. అసలు ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని జెలెన్‌స్కీకి కేవలం నాలుగు శాతం మాత్రమే ప్రజామద్దతు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరులో తాను పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని ఈసందర్భంగా ట్రంప్‌ వెల్లడించారు. రష్యా ఈ వినాశనం ఆపడానికి ఏదో చేద్దామనుకుంటోందని అభిప్రాయడ్డారు. ప్రతి వారం వేల మంది సైనికులు చనిపోతున్నారని గుర్తుచేశారు. తాము దీనిని ముగించాలనుకొంటున్నట్లు పేర్కొన్నారు. ఇది బుద్ధి తక్కువ యుద్ధమని ట్రంప్‌ అభివర్ణించారు. సౌదీలో మొదలైన శాంతిచర్చలపై ఇటీవల జెలెన్‌స్కీ అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ను పక్కనపెట్టారన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. దానితో సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు. ''ఎవరినీ పక్కన పెట్టం. ఉక్రెయిన్‌తో పాటు మా ఐరోపా భాగస్వాములు, ఇతరులతోను చర్చలు జరుపుతాము'' అని పేర్కొన్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ రియాద్‌లో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్‌ నాటోలో చేర్చే అంశంపై మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీపడమన్నారు. అది తమ దేశ భద్రతకు ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. ''నాటో సభ్యదేశ సైన్యాలైనా.. లేదా ఐరోపా సమాఖ్య కింద వచ్చే సేనలైనా.. దేశాల పతాకాలతో వచ్చే దళాలైనా సరే.. ఉక్రెయిన్‌లో మోహరించడాన్ని ఏమాత్రం ఆమోదించం'' అని ఆయన తేల్చిచెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)