ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం పోయిన మూడునెలలకే ఏలూరుకి చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని ఆ పార్టీ రాజీనామా చేశారు ఆ తర్వాత ఆయన చూపు టీడీపీపై పడింది. ఆళ్ల నాని రాకను ఆ జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకించారు. ఆ జిల్లా పరిణామాలపై ఫోకస్ పెట్టిన టీడీపీ హైకమాండ్, అక్కడి నుంచి నివేదికలు తెచ్చించుకుని జిల్లా నేతలతో మంతనాలు సాగించింది. ఈ క్రమంలో గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీలో చేరారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా నేతలంతా కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి సూచన చేసినట్లు తెలుస్తోంది . కార్యకర్తల మధ్య సమస్యలు ఏమాత్రం పెద్దది కాకుండా మీరే పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చినట్టు అంతర్గత సమాచారం. ఆళ్ల నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన పని చేశారు. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన, మారిన రాజకీయాల పరిణామాల నేపథ్యంలో సభ్యత్వానికి, పార్టీకి మూడు నెలల కిందట రాజీనామా చేసిన విషయం తెల్సిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏలూరు నియోజకవర్గంలోని వైసీపీ నేతలంతా విడతల వారీగా టీడీపీలో చేరిపోయారు. జెడ్పీ ఛైర్మన్, ఆమె భర్త, కార్పొరేటర్లు ఇలా అందరూ సైకిల్ ఎక్కేశారు.చివరకు మాజీ మంత్రి ఆళ్ల నాని వంతైంది. ఆయనకు పార్టీలో ఎలాంటి బాధ్యతలు సీఎం చంద్రబాబు అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది.
టీడీపీలో ఆళ్ల నాని చేరిక !
February 14, 2025
0
Tags