ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు రూ.50లక్షలు విరాళం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

Telugu Lo Computer
0


విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 'యూఫోరియా మ్యూజికల్ నైట్‌' ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రసంగిస్తూ ఎలాంటి ప్రచార హంగామా లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లడం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు ఉన్న ప్రత్యేకత అని, మరో వందేళ్ల పాటు ఇది కొనసాగాలని ఆకాంక్షించారు. నారా భువనేశ్వరిగారంటే నాకు అపారమైన గౌరవం. కష్టాలు, ఒడుదొడుకుల్లో చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమెను దగ్గరి నుంచి చూశా. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నేతృత్వంలో తలసీమియా బాధితుల కోసం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణగారిని ఎప్పుడు కలిసినా 'బాలయ్య అని పిలువు' అంటారు కానీ, నాకు 'సర్‌' అనే పిలవాలనిపిస్తుంది. ఎవరినీ లెక్క చేయని వ్యక్తిత్వం ఆయనది. తాను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఎన్ని తరాలు వచ్చినా ప్రేక్షకులు ఆకర్షించే నటన ఆయన సొంతం. సినిమాల్లోనే కాదు, సేవాల్లోనూ ముందుంటారు. ఇవన్నీ గుర్తించే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో గుర్తించింది. ప్రచార హంగామా లేకుండా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవ చేసుకుంటూ వెళ్తుంది. విదేశాల నుంచి వైద్యులు వచ్చి, చికిత్స చేసి వెళ్లిపోతారు. ఎన్టీఆర్‌ మన మధ్య లేకపోయినా ట్రస్ట్‌ ద్వారా మన గుండెల్లో ఉన్నారు. ఆయన అమరజీవి. ఒక మంచి పని ప్రారంభించడం, దానిని కొనసాగించడం చాలా కష్టం. అలాంటిది 28ఏళ్లుగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ కొనసాగించడం.. ఇప్పుడు తలసీమియా బాధితుల కోసం ఈవెంట్‌ను ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం. నా దగ్గరకు వచ్చే బాధితులకు సాయం చేయమని కోరుతూ సీఎం చంద్రబాబుగారి ఆఫీస్‌కు లేఖరాస్తే, వారు స్పందించే తీరు అద్భుతంగా ఉంటుంది. ట్రస్ట్‌ను ఎప్పుడూ నిర్వీర్యం చేయా లి.. హైజాగ్‌ చేయాలనుకునేవాళ్లు ఉంటారు. దాన్ని కాపాడుకుంటూ చంద్రబాబు వచ్చారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బోర్డు సభ్యులందరికీ నా అభినందనలు. మేమంతా ట్రస్ట్‌ కోసం మా వంతు సాయం చేస్తాం. ఎంత సేపూ పనే కాదు. సహాయ కార్యక్రమంలో వినోదం చూడొచ్చని ఈ మ్యూజికల్‌ నైట్‌ ద్వారా నిరూపించారు. విజయవాడకు వన్నె తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సంగీతం అందిస్తున్న తమన్‌ గారికి ప్రత్యేక అభినందనలు. నేను కూడా తలసీమియా బాధితుల కోసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు రూ.50లక్షలు విరాళం అందిస్తున్నా. ఈ ఈవెంట్‌కు టికెట్‌ కొనమని మా వాళ్లకు చెబితే, విషయం తెలిసి, భువనేశ్వరిగారు 'మీరు టికెట్‌ కొనక్కర్లేదు. కార్యక్రమానికి రండి' అన్నారు. మీరంతా టికెట్‌ కొని నేను ఉత్తిగా రావడం తప్పుగా అనిపించింది. అందుకుని, నా వంతుగా తలసీమియా బాధితుల చికిత్స కోసం త్వరలోనే ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు రూ.50లక్షలు విరాళం ఇస్తా. మీ అందరికీ ధన్యవాదాలు'' అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)