ఈపీఎఫ్ఓ పరిధిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28, 2025 రోజున సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో ఈపీఎస్ కనీస పెన్షన్ పెంపు విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ రోజున ఈ ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లకు వడ్డీ రేటును నిర్ణయించనున్నారు. వడ్డీ రేటు నిర్ణయం కీలకంగా ఉన్నప్పటికీ పెన్షన్ పెంపుపైనా నిర్ణయం ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి. కనీస పెన్షన్ రూ.7500 పెంచాలనే డిమాండ్‌పై ప్రకటన వస్తుందని ఉద్యోగులు సైతం ఆశాభావంతో ఉన్నారు. ఈపీఎఫ్ఓలో సభ్యులుగా ఉన్న ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు చాలా ఏళ్ల నుంచి కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 2014 నుంచి కనీస పెన్షన్ రూ.1000గానే ఉంది. అప్పటి నుంచి కనీస పెన్షన్ పెంచాలని కోరుతూనే ఉన్నారు. కానీ, ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. ఈపీఎఫ్ సభ్యులు తమ శాలరీ నుంచి ప్రతి నెలా 12 శాతం చొప్పున పీఎఫ్ ఖాతాకు జమ చేస్తున్నారు. అంతే మొత్తంలో కంపెనీ యాజమాన్యాలు జమ చేస్తాయి. అయితే, కంపెనీలు జమ చేసే 12 శాతంలో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కి వెళ్తుంది. మిగిలిన 3.67 శాతం ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. 2025-26 బడ్జెట్‌లో ఈపీఎస్ కనీస పెన్షన్ పెంపుపై ప్రకటన ఉంటుందని ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ బడ్జెట్‌కి ముందు ఈపీఎస్ -95 పరిధిలోని పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈపీఎస్ కనీస పెన్షన్ రూ.7500 పెంచాలని, దాంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్ ఇవ్వాలనే దీర్ఘకాల డిమాండ్‌పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఆర్థిక మంత్రి భరోసా కల్పించారని ఆ తర్వాత మాట్లాడిన ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ వెల్లడించింది. సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. ఈపీఎస్ కనీస పెన్షన్రూ.1000 నుంచి రూ.7500కు పెంచాలని గత ఏడెనిమిదేళ్ల నుంచి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు డీఏ బెనిఫిట్స్, ఉచిత వైద్య చికిత్స అందించాలని కోరుతున్నారు.
28న ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం !
February 22, 2025
0
Tags