పదవీ విరమణ వయసును పెంచిన కాగ్నిజెంట్‌

Telugu Lo Computer
0

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచింది. ప్రస్తుతం పదవీ విరమణ వయసు 58గా ఉండగా, దాన్ని 60కు పెంచింది. ఈ విషయాన్ని కంపెనీ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలియజేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ మార్పు భారత్‌లోని అన్ని కాగ్నిజెంట్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుందని తెలుస్తోంది. చాలా ఐటీ సంస్థలు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్లుగా నిర్ణయించాయి. తాజాగా కాగ్నిజెంట్‌ ఈ వయసును 60కి పెంచింది. అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను సద్వినియోగం చేసుకొనేందుకు ఈ మార్పు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గ్లోబల్‌ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్‌లో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం గురించి ఓ కార్యక్రమంలో కాగ్నిజెంట్‌ సీఈఓ రవి కుమార్‌ మాట్లాడారు. ''కాగ్నిజెంట్‌కు భారత్‌లో 2.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇదివరకు కేవలం పెద్ద నగరాల్లోనే కాగ్నిజెంట్‌ కార్యాలయాలు ఉండేవి. ఇప్పుడు చిన్న నగరాలకూ విస్తరించాం. ఇందౌర్‌లో కూడా మా కార్యాలయం ప్రారంభించాం. కంపెనీ వృద్ధిలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే దశాబ్దంలో ప్రపంచ సాంకేతిక హబ్‌గా ఉండబోతోందని విశ్వసిస్తున్నా'' అని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)