దర్శకుడు మిస్కిన్‌ వ్యాఖ్యలపై విశాల్‌ ఆగ్రహం

Telugu Lo Computer
0


ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు మిస్కిన్‌ అనంతరం క్షమాపణలు చెప్పాడు. ఈ విషయంపై తాజాగా నటుడు, నడిగర్‌ సంఘం జనరల్‌ సెక్రటరీ విశాల్‌ దర్శకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవిధంగా వ్యవహరించడం మిస్కిన్‌కు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. ఎంతోమంది సంగీతప్రియులు ఆరాధించే ఇళయరాజా గురించి అలాంటి కామెంట్స్‌ చేయడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. ''అమర్యాదకర వ్యాఖ్యలు చేసేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఆయనకు పరిపాటిగా మారింది. మన మనసుకు అనిపించిన విషయాన్ని మాట్లాడే స్వేచ్ఛ ప్రతిఒక్కరికీ ఉంటుంది. కాకపోతే నలుగురిలో ఉన్నప్పుడు, స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఇళయరాజాను ఎంతోమంది ఆరాధిస్తుంటారు. అలాంటి వ్యక్తిని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని నేను ఏమాత్రం క్షమించను. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి ఆ తర్వాత రోజు క్షమాపణలు చెబితే మీరు అంగీకరిస్తారా?'' అని విశాల్‌ ప్రశ్నించారు. అనంతరం ఆయన నడిగర్‌ సంఘం తరఫున పద్మ అవార్డులకు ఎంపికైన నటుడు అజిత్‌, నటి శోభనకు అభినందనలు తెలిపారు. ఆ విషయంలో తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. విశాల్‌ హీరోగా నటించిన 'తుప్పారివాలన్‌' (తెలుగులో 'డిటెక్టివ్‌')తో మిస్కిన్‌ తెలుగు వారికి సుపరిచితులయ్యారు. ప్రస్తుతం ఆయన దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ చేస్తున్నారు. ఇటీవల 'బాటిల్‌ రాధ' అనే సినిమా ఈవెంట్‌కు ఆయన హాజరయ్యారు. ఇందులోభాగంగా ఇండస్ట్రీలో ఉన్న వారందరికంటే తానే ఎక్కువగా మద్యం తాగుతానని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ  ఇళయరాజా సంగీతం వల్ల ఎంతోమంది మద్యానికి బానిసలయ్యారని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అంతటా వైరల్‌ అయ్యాయి. మిస్కిన్‌ తీరును సినీప్రియులు తప్పుపట్టారు. దీంతో ఆయన ఆ తర్వాత రోజు క్షమాపణలు చెప్పారు. తన ఉద్దేశాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)