ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది. వివాహం అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నీలో సింధు సాధికారిక ప్రదర్శనతో రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో రెండు సార్లు ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన సింధు 21-15, 21-13 తేడాతో జపాన్‌కు చెందిన మనమి సూజుపై విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. హైదరాబాద్‌లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తనకంటే తక్కువ ర్యాంక్ కలిగిన జపాన్ షట్లర్‌పై తనదైన ఆటతో విరుచుకుపడింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో క్రాస్ కోర్ట్ స్మాష్‌లతో చెలరేగిన సింధు.. వరుస గేమ్‌ల్లో గెలిచి విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. అక్టోబర్ 2024 తర్వాత సూపర్ 750 టోర్నీల్లో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. గతేడాది నవంబర్‌లో సింధు సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ టైటిల్ గెలిచింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మలేసియా ఓపెన్‌కు దూరంగా ఉన్న సింధు.. వివాహం అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నీలో సత్తా చాటింది.
క్వార్టర్ ఫైనల్ చేరిన సింధు !
January 16, 2025
0
Tags