ఆంధ్రప్రదేశ్ లోని కోటిపల్లి-నరసాపురం రైల్వేలైనుకు మోక్షం లభించింది. దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితమవుతున్న ఈ ప్రధాన ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ మార్గంలో అవసరమైన భూసేకరణ గతంలోనే పూర్తయింది. తాజాగా కోనసీమ కలెక్టర్ ఆదేశాల మేరకు రైల్వే అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకొని పనులు ప్రారంభిస్తున్నారు. భూసేకరణ జరిగినప్పటికీ పనులు ప్రారంభించకపోతుండటంతో రైతులు పంటలు వేశారు. ప్రస్తుతం పంటల కోతకాలం కూడా పూర్తికావడంతో వెంటనే వాటిని స్వాధీనపరుచుకొని అధికారులు పనులు ప్రారంభిస్తున్నారు. భూసేకరణ పూర్తయిన ప్రతి గ్రామానికి అధికారులు ప్రత్యేక బృందాన్ని పంపించి భూములను సర్వే చేయిస్తున్నారు. హద్దులను గుర్తించిన తర్వాత పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఖాళీగా ఉంటే రైతులు మరో పంట వేస్తారని, అటువంటి అవకాశం ఇవ్వకుండా రైల్వే అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నదులపై మూడు వంతెనలు నిర్మించాల్సి ఉండటంతో బడ్జెట్ వ్యయం భారీగా పెరగనుంది. రూ.2,120 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. ఇప్పటివరకు రూ.1181 కోట్లు ఖర్చుపెట్టారు. ప్రాజెక్టు వ్యయంతో 25 శాతాన్ని రాష్ట్రం భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. 2000-2001లో ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే తెలిపింది. దీన్ని సాధించడంలో దివంగత బాలయోగి, మాజీ కేంద్ర మంత్రి సత్యనారాయణ లాంటివారు ఎంతో కృషిచేశారు.
కోటిపల్లి-నరసాపురం రైల్వేలైనుకు మోక్షం !
January 17, 2025
0
Tags