అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా తగ్గిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రూపాయి విలువ ఒక్కసారిగా 16 పైసలు క్షీణించి చరిత్రలోనే తొలిసారిగా 86.04కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఎక్స్' వేదికగా ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ''చరిత్రలోనే తొలిసారిగా రూపాయి మారకం విలువ కనిష్ఠ స్థాయికి చేరుకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో డాలరుతో రూపాయి మారకం విలువ 58-59 గా ఉండేది. అప్పట్లో నరేంద్ర మోదీ రూపాయి విలువను ప్రభుత్వ ప్రతిష్ఠతో ముడిపెట్టేవారు. డబ్బు విలువ ఏ దేశంలోనూ ఇంతగా పడిపోదని, అంతా తనకే తెలుసని చెప్పేవారు. మరి ఇప్పుడేమైంది. ఆయనే ప్రధానిగా ఉన్నారు. పతనంలో రూపాయి రికార్డులు సృష్టిస్తోంది. రోజు రోజుకూ దాని విలువ పడిపోతోంది. అందువల్ల దేశ ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి'' అని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
రూపాయి పతనంపై దేశ ప్రజలకు ప్రధాని సమాధానం చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ !
January 11, 2025
0
Tags