వేరుశనగ పంటకు మద్దతు ధర పడిపోవడంతో మార్కెట్ కార్యాలయంపై రైతుల దాడి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట జాతీయ వ్యవసాయ మార్కెట్ లో రైతులు మార్కెట్ కార్యాలయంపై దాడి చేశారు. వేరుశనగ ధాన్యానికి గిట్టుబాటు కల్పించాలని రైతులు ఎంత మొత్తుకున్నా మార్కెట్ అధికారులు, మార్కెట్ కమిషన్ దారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ సెక్రెటరీ నరసింహులుతో పాటు, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత భర్త మల్లేష్ పై రైతులు దాడి చేశారు. దీంతో వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొద్దిసేపు వ్యవసాయ మార్కెట్ లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. గత మూడు రోజుల క్రితం వేరుశనగ పంటకు మద్దతు ధర 7 వేల పైచిలుకు ఉందని, ఒక్కసారిగా ఉన్నట్టుండి సోమవారం రూ.4 నుండి రూ.6 వేలకు పైగా ధర కల్పిస్తుండడంతో కోపంతో ఊగిపోయారు. ఈ క్రమంలో మార్కెట్ అధికారులకు రైతులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏం జరుగుతుందోననే భయంతో మార్కెట్ అధికారులు పరుగులు తీశారు. చైర్మన్ భర్త మల్లేష్ చొక్కా చినిగిపోయింది. భయపడిన మల్లేష్ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని మార్కెట్ కార్యాలయంలోకి పరుగులు తీశారు. అక్కడితో ఆగకుండా మార్కెట్ కార్యాలయంలో ఫర్నిచర్ ను రైతులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎస్సై రమేష్ మార్కెట్ కార్యాలయానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రైతులు చిన్న చిన్న ఆవేశాలకు పోయి నష్టపోవద్దని ఎస్సై రైతులకు సూచించారు. ప్రస్తుతం మార్కెట్ కొనుగోలు నిలిచిపోయాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)