మహా కుంభమేళాలో మౌని అమావాస్య కారణంగా నెలకొన్న రద్దీతో తొక్కిసలాట ఘటన చోటుచేసుకొని పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అనేకమంది గాయపడ్డారు. ఆ భయానక క్షణాలను కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మీడియాతో పంచుకున్నారు. విపరీతమైన రద్దీ వల్ల ఎటు వెళ్లాలో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొందని తెలిపారు. చీకట్లో కన్పించని చెత్త బుట్టలు కాళ్లకు తగలడంతో చాలామంది కింద పడిపోయారని పేర్కొన్నారు. ''తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు ఒక్కసారిగా భక్తులు బయల్దేరారు. తలపై పెద్దపెద్ద లగేజీలతో భక్తులు తరలివచ్చారు. అయితే, ఎటునుంచి వెళ్లాలి, ఎక్కడ స్నానమాచరించాలన్న దానిపై ఎవరికీ అవగాహన లేదు. పైగా యాత్రికుల కోసం ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఇనుప చెత్త డబ్బాలను ఏర్పాటుచేశారు. చిమ్మచీకట్లో అవి ఎవరికీ కన్పించలేదు. దీంతో వాటికి తగిలి చాలామంది కింద పడిపోయారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది'' అని ప్రత్యక్ష సాక్షి, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ వివేక్ మిశ్రా తెలిపారు. చెత్త డబ్బా తగిలి తాను కూడా కింద పడిపోయాయని, ఎలాగోలా అక్కడినుంచి కుటుంబంతో బయటపడ్డానని చెప్పారు. వేరే భక్తులను కాపాడే క్రమంలో స్వల్పంగా గాయపడినట్లు వివరించారు. మరో ప్రత్యక్ష సాక్షి రామ్‌సింగ్ మాట్లాడుతూ ''ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. దానివల్లే పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. చాలామంది మా కళ్ల ముందే కింద పడిపోయారు'' అని తెలిపారు. త్రివేణి సంగమానికి కిలోమీటరు దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులంతా సంగమం ప్రధాన ఘాట్ వద్దే స్నానాలు చేసేందుకు యత్నించగా ఆ మార్గంలోని బారికేడ్లు విరిగి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తొక్కిసలాట ఘటనతో త్రివేణి సంగమం వద్ద కొంతసేపు పుణ్య స్నానాలను నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పునరుద్ధరించారు. మౌని అమావాస్యను పురస్కరించుకొని నేడు భక్తులు పెద్దఎత్తున ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు దాదాపు 3 కోట్ల మంది పుణ్య స్నానమాచరించినట్లు అధికారులు తెలిపారు.
ప్రయోగరాజ్ లో పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయనని, భక్తులు పుకార్లు నమ్మొద్దని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ విజ్ఞప్తి చేశారు. కుంభమేళలో భక్తుల రద్దీ అధికంగా ఉందని, మౌని అమావాస్య పురస్కరించుకని భక్తులు పోటెత్తారని చెప్పారు. ఉదయం 8 గంటల వరకు మూడు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. రద్దీ తక్కువగా ఉన్న ఘాట్ ల దగ్గర పుణ్ స్నానాలు ఆచరించాలని కోరారు. తొక్కిసలాటలో గాయపడిన 40 మందికి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారని చెప్పారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారని చెప్పారు. యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం యోగి చెప్పారు.